పేదోడి గంజి నీళ్ళ బతుకులు..!!

Feb 4,2024 08:19 #Poetry
poor people life poetry

ఎవరిపైకి విసిరినా గుడిసెకే రాళ్ళ దెబ్బలు

పేదోడి చేతికే గాయాల మచ్చలు మిగిలే

ఎన్నిచోట్ల తిరిగినా నోట్లు ధనవంతుడి పెట్టెకే

చిల్లర ఎంత పోగుచేసినా సామాన్యుడి మట్టికే..

కార్పొరేట్‌ చెట్టుకి కనకపు కాయలు కాస్తుంటే

నోటున్నచోటే కిలకిల రావాలతో చేరికలు

మాయలు ఎన్ని చేసినా నాలుగు వేళ్లు నోట్లోకే

పరమాన్నపు రుచిలో జీడిపప్పులు ఆనందం కోసమే..

రుధిరపు మరకలతో శ్రమజీవుల ప్రయాణం

నన్నెత్తిన సూర్యబింబం వెలకడుతుంది వేతనం

చెమట చుక్కల స్వేదం చిమ్ముతుంది తనువు

పెద్దోడి చేతిలో రూకలే పేదోడికి గంజి నీళ్ళ బతుకులే..

దేశంలో తిమింగలాలు అద్దాలమేడల్లో కనిపిస్తుంటే

కూల్చబడ్డ గోడలే కూలీలుగా నిర్మిస్తున్నారు..

అర్ధాకలి కడుపులు అరణ్య రోదనలు చేస్తే

నగర ప్రపంచం ఆకాశపు భవంతుల్లో నవ్వుతోంది..

సమానత్వపు మాటలు ప్రతిచోటా వినిపిస్తుంది

అవినీతి బిడ్డలు అంతటా విస్తరిస్తూ పోతుంటే

నల్లధనం తెల్లదనమై మల్లెపువ్వులా నవ్వుతోంది

ప్రజాస్వామ్యంలో తియ్యటి విషగుళికల ప్రయోగమే…!

 

  • కొప్పుల ప్రసాద్‌ 9885066235
➡️