నాసిరకం చదువులు

Jan 19,2024 07:20 #Editorial

           మన దేశ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో వెల్లడించే అసర్‌-2023 నివేదిక బుధవారం వెలువడింది. గ్రామీణ ప్రాంతాల్లోని 14-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థులపై ఈ సర్వే జరిగింది. ఈ వయసు యువతీ యువకుల్లో 13.2 శాతం మంది చదువుకు దూరంగా ఉన్నారట! విద్యాభ్యాసం చేస్తున్న వారిలో మూడింట ఒక వంతు (33.7 శాతం) మంది జీవన భృతి కోసం బయట ఏదో ఒక పని చేయాల్సి వస్తోందిట !

అందుతున్న చదువులోనూ నాణ్యతాప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయని ఈ సర్వే గణాంకాలు చెబుతున్నాయి. మాతృభాషలోని రెండో తరగతి పాఠాన్ని 26.4 శాతం మంది హైస్కూలు, కాలేజీ విద్యార్థులు చదవలేకపోతున్నారట! అయితే, ఇందులో అబ్బాయిల కన్నా అమ్మాయిల పరిజ్ఞానం కాస్త మెరుగ్గా ఉంది. మూడంకెల సంఖ్యను ఒక అంకెతో భాగించమని అడిగితే- నూటికి 57 మంది సరైన జవాబు రాబట్టలేకపోయారట! ‘ఐ లైక్‌ టు రీడ్‌’, ‘షి హాజ్‌ మెనీ బుక్స్‌’ వంటి చిన్న చిన్న ఆంగ్ల వాక్యాలను 62.7 శాతం మంది చదవలేకపోయారట! చదివిన వారిలోనూ 26.5 శాతం మంది వాటి అర్థమేమిటో సరిగ్గా చెప్పలేకపోయారట! నిత్య జీవితంలో తారసపడే సమయం లెక్కింపు, కొలతలు, శాతాలు వంటి గణింపూ తెలియని పిల్లలూ సగానికి పైగానే ఉన్నారట! అదే సమయంలో స్మార్టుఫోన్ల వినియోగం, సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండడం హెచ్చుగానే కనిపిస్తోంది. 30 వేల ఇళ్లల్లో సర్వే జరిపితే, సుమారు 27 వేల ఇళ్లల్లో స్మార్టుఫోన్లు ఉన్నాయి. 92 శాతం యువ విద్యార్థులు వాటిని వినియోగిస్తున్నారు. ఈ సంఖ్యలో అబ్బాయిలదే అత్యధిక భాగం.

ప్రథమ్‌ అనే సంస్థ 2005 నుంచి గ్రామీణ భారతంలో విద్యావ్యవస్థ తీరుతెన్నులను, విద్యార్థుల నైపుణ్యాలను అధ్యయనం చేస్తోంది. సంవత్సరం తప్పించి సంవత్సరం కొన్ని ప్రాథమిక పరిశీలనాంశాలను గీటురాళ్లుగా పెట్టుకొని విద్యార్థులను కలిసి మాట్లాడుతోంది. గతేడాది అక్టోబరులో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, 1664 గ్రామాల్లో 17 భాగస్వామ్య సంస్థలతో కలిసి సర్వే నిర్వహించింది. ఐదేళ్ల క్రితం 2017లో చేసినట్టే 14-18 మధ్య వయస్కులపై పరిశీలనలు జరిపింది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం, ఖమ్మం జిల్లాలను అధ్యయనానికి ఎంచుకొంది. అన్ని రాష్ట్రాల కన్నా కేరళ ప్రమాణాలు అనేక అంశాల్లో మెరుగ్గా నమోదయ్యాయి. విద్యారంగంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధ అధ్యయన ఫలితాల్లో ప్రతిబింబించింది.

కానీ, చాలా రాష్ట్రాల్లో గ్రామీణ విద్యాప్రకాశం మసకబారి కనిపిస్తోంది. పదేళ్ల పాటు విద్యాభ్యాసం కొనసాగాక కూడా విద్యార్థుల్లో కనీస పఠన, గణన, దైనందిన వ్యవహార సామర్థ్యాలు కనపడడం లేదు. జీవన నైపుణ్యాలు అలవడాల్సిన దశలో ఉన్న విద్యార్థులకు సాధారణ తెలివిడిని కూడా మన విద్యావ్యవస్థ ఎందుకు ఇవ్వలేకపోతోంది? నోటిలెక్కలు కూడా చేత కాని నిస్సహాయ స్థితిలోకి వారిని నెట్టేస్తున్నది ఎవరు? కొన్ని దశాబ్దాలుగా ప్రయివేటు విద్యకు పెద్ద పీట వేసి, సర్కారు విద్యకు చెదలు పట్టించిన పాలకుల నిర్లక్ష్యమూ, నిర్పూచీతనమే ఇందుకు ప్రధాన కారణం. విద్యాసంస్థల్లో ఏళ్ల తరబడి ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయకపోవడం, నియమించినా కాంట్రాక్టు పోస్టులకే పరిమితం చేయడం, బోధనాపరమైన సదుపాయాలను సమకూర్చకపోవడం వంటివన్నీ విద్యా ప్రమాణాలు దిగజారిపోవటానికి దారి తీస్తున్నాయి. అన్ని వయసుల వారిలోనూ లెక్కించే, ప్రశ్నించే స్వభావాన్ని తార్కిక శక్తి పెంపొందిస్తుంది. మనిషి భాగస్వామ్యాన్ని, ఆలోచనలను శూన్యపరిచే ‘ఏమీ చేయకపోయినా పర్లేదు’ అన్న హీన సంస్క ృతి ఇటీవల ప్రబలుతోంది. అన్నిటికీ స్మార్ట్‌ఫోన్ల వంటి సాంకేతిక ఉపకరణాల మీదనే ఆధారపడడం పెరుగుతోంది. కంప్యూటరు, స్మార్ట్‌ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగిందని; వాటిలోనే సినిమాలు చూడడం, గేమ్స్‌ ఆడడం అంతటా అలముకొందని ఈసారి ప్రథమ్‌ సర్వే ప్రత్యేకంగా పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాణ్యమైన విద్యను అందించే బాధ్యతను చిత్తశుద్ధితో అమలు చేయాలి. నవ, యువ తరాల్లో తార్కికశక్తిని కొడిగట్టేలా మోహరిస్తున్న మత, మార్కెట్‌ మాయాజాలాలకు అడ్డుకట్ట వేయాలి. ‘తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపొందించబడుతుంది’ అన్న ఉత్తమ మాటకు ఉక్కు సంకల్పంతో కూడిన ఆచరణను జోడించాలి. అలా జరిగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం తల్లిదండ్రుల, మేధావుల, విద్యార్థి యువజన సంఘాల బాధ్యత.

➡️