దానిమ్మలో పోషకాలెన్నో…

Apr 14,2024 04:05 #jeevana

ఏడాది పొడవునా లభించే పండ్లలో దానిమ్మ ఒకటి. తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. వారంలో ఏడు రోజులపాటు క్రమం తప్పకుండా తింటే కొన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. దానిమ్మలో పోషకాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, విటమిన్‌ సి, కె, ఫోలేట్‌, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వాటిని తినటం వల్ల శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ నిరోధక లక్షణాలను కలిగివున్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించటానికి మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. రసం తాగటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే పాలీ ఫెనాల్స్‌ గుణాలు వ్యాయామం చేసేటప్పుడు శక్తిని అందిస్తాయి. త్వరగా అలసట రాదు. ఫైబర్‌ మలబద్ధకాన్ని నివారించటానికి, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. విటమిన్‌-సి రోగ నిరోధకశక్తిని పెంచటానికి, జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులను నివారించటానికి సహాయపడుతుంది.

➡️