అధినేతల రాకతోవేడెక్కుతున్న రాజకీయం

Apr 22,2024 22:40

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : వివిధ పార్టీల అధినేతల రాకతో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రచారం నువ్వా? నేనా? అన్నట్టుగా ఊపందుకుంటోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలతోపాటు ఇతరులు కూడా స్వంతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వారంతా ప్రచార పర్వంలో మునిగితేలుతున్నారు. ఈనేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం ఎస్‌.కోటలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. మంగళవారం గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని బొండపల్లిలో మహిళా ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. ఉదయం 11:30గంటలకు బహిరంగ సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. అదే రోజు సాయంత్రం 4గంటలకు వైసిపి అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విజయనగరం రానున్నారు. చెల్లూరు వద్ద తలపెట్టిన సిద్ధం సభలో పాల్గొంటారు. బుధవారం కూడా జిల్లాలో పార్టీ ప్రచారం కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. మూడు రోజులపాటు మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ప్రధాన నేతల పర్యటన జరగనుండడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయా పార్టీ నేతలంతా తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. రెండు గ్రూపులు కలిసినప్పటికీ అంతర్గత విభేదాలు ఇంకా సమసిపోకపోవడంతో ఎస్‌.కోటలో చంద్రబాబు పర్యటించారు. రాత్రికి కూడా బసచేసి మరీ నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో చర్చలు జరిపారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్థేశం చేశారు. గజపతినగరంలో కొండపల్లి శ్రీనివాస్‌ కొత్త అభ్యర్థికావడం, మాజీ ఎమ్మెల్యే అలకబూని అసమ్మతిరాగం తీయడంతో గజపతినగరంపైనా బాబు దృష్టిసారించారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడు సిద్ధం సభలో జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరనున్నారు.విజయనగరంలో వైసిపి, టిడిపిల మధ్య హోరాహోరీగా ఉండడం, ఈసారి గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించడంతో విజయనగరం నియోజకవర్గంలోనూ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నాలుగు చోట్ల ప్రచారాలు చేపట్టడం ద్వారా మిగిలిన నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కూడా ఉత్తేజపర్చాలని బావిస్తున్నట్టు సమాచారం. అవకాశాన్నిబట్టి మరోదఫా జిల్లా పర్యటన చేపట్టి మిగిలిన నియోజకవర్గాల్లో సభలు నిర్వహించే యోచనలో బాబు ఉన్నట్టుగా తెలిసింది. అటు భోగాపురంలోనూ జనసేన – టిడిపి ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవి గెలుపు ద్వారా జనసేన ఉనికి చాటుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే సీటు కేటాయింపు మొదులకుని, అనంతరం అసమ్మతి రాగాలను చల్లార్చడం, నేడు ప్రచార సభలు నిర్వహించడం వరకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలోని అసంతృప్తులు, సీటుకోసం ఆశపడిన కర్రోతు బంగార్రాజును నేరుగా పిలిపించుకుని చంద్రబాబు బుజ్జగించారు. అయినప్పటికీ అసంతృప్తి జ్వాలు అగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలకు చెందిన నేతలు నెల్లిమర్ల సభలో పాల్గొననున్నారు.

➡️