రాజకీయ పార్టీలు ప్రచారాలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి : శివ్ నారాయణ్ శర్మ

Mar 27,2024 15:46 #collector, #Kurnool

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : రాజకీయ పార్టీల ప్రచారాల కోసం ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆదోని ఎన్నికల అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్ నందు సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో, సంబంధిత అధికారులతో ఆదోని నియోజకవర్గ ఎన్నికల సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గ ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని సమీక్షకు హాజరైన రాజకీయ పార్టీ ప్రతినిధులకు సబ్ కలెక్టర్ సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గనికి పోటీ చేసే అభ్యర్థి 40 లక్షల రూపాయలకు మించి ఖర్చు చేయరాదన్నారు. అభ్యర్థులు ప్రచార నిమిత్తం వినియోగించే బ్యానర్లు, జెండాలు, టోపీలు, వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించే అడ్వర్టైజ్మెంట్స్ లకు సంబంధించిన రెట్ కార్డు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. సంబంధిత రేటింగ్ కార్డు ప్రకారమే తొలుతగా అనుమతి తీసుకొని ప్రచారాలు నిర్వహించుకోవాలన్నారు. పార్టీ అభ్యర్థులు పర్మిషన్ తీసుకున్న ప్రకారమే ఖర్చు చేయాలన్నారు.

పార్టీల అభ్యర్థులు, సభలు,సమావేశాలునిర్వహించాలనుకుంటే 48 గంటల ముందే అనుమతులు తీసుకొని సభలు నిర్వహించుకోవాలన్నారు. యంసిసి, ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో వ్యూయింగ్ టీం, తదితర టీములు నియోజకవర్గంలో పర్యవేక్షిస్తుంటారన్నారు. ఈసారి నూతనంగా ఎన్నికల సంఘం ఇంటింటి ప్రచార నిమిత్తమై 48 గంటల ముందు ప్రచారం చేసే ప్రాంతాలపై ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎన్నికల సంఘం నిబంధన నియమించిందని సబ్ కలెక్టర్ సూచించారు. ఈ విషయంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై పునరాలోచన చేయాలని జిల్లా ఎన్నికల అధికారికి, ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీల ప్రతినిధుల తరపున వినతి అందజేయాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తమ ఎన్నికల ప్రచారానికి ఎన్నికల సంఘం సూచించిన మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుందని ఈ మేరకు ఖర్చు చేసే వ్యయాన్ని లెక్క కట్టి ఏరోజుకారోజు నివేదికలను ఇవ్వాలని సూచించారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలు, ఆహార పదార్థాల ఖర్చులతో సహా లెక్కించడం జరుగుతుందన్నారు. 10 లక్షలకు మించి లావాదేవాలు జరిగితే ఇన్ కమ్ టాక్స్ అధికారులకు తెలియజేయాలన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నుండి వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్, పెయిడ్ న్యూస్ కు సంబంధించిన వాటిని కూడా లెక్క కట్టి అభ్యర్థుల ఖాతాలో నమోదు చేయడం జరుగుతుందని సబ్ కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమానికి తహశీల్దారు హసీనా సుల్తానా, డిఎస్పి శివ నారాయణస్వామి, మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ్మ, ఎలక్షన్ ఉప తహశీల్దారు రామేశ్వర రెడ్డి, ఎంపీడీవో విజయ్ శేఖర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️