మహిళా అధికారుల పదోన్నతులపై నాలుగు నెలల్లో విధానం

  • సైన్యానికి గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : కల్నల్‌ ర్యాంకు నుండి బ్రిగేడియర్‌ ర్యాంకు వరకూ మహిళా అధికారుల పదోన్నతులకు సంబంధించిన విధానాన్ని ఖరారు చేసేందుకు సుప్రీంకోర్టు సైన్యానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలో న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన బెంచ్‌ అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, సీనియర్‌ న్యాయవాది ఆర్‌. బాలసుబ్రమణ్యం వాదనలను నమోదు చేసింది. మహిళా అధికారుల పదోన్నతులపై వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి విధానాన్ని రూపొందించాలని సైన్యానికి ప్రధాన న్యాయమూర్తి సూచించారు. పదోన్నతులలో వివక్ష చూపుతున్నారంటూ కొందరు మహిళా అధికారులు ఆరోపిస్తున్నారు. మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు 2020 ఫిబ్రవరిలోనే ఆదేశించింది. మహిళలకు శారీరక పరిమితులు ఉన్నాయంటూ కేంద్రం చేసిన వాదనను తోసిపుచ్చింది. ఇది మహిళలపై లింగ వివక్ష చూపడమే అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది.సంప్రదింపులు కొనసాగుతున్నాయి : సైన్యంమహిళా అధికారుల పదోన్నతుల విషయంలో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సైన్యం కోర్టుకు తెలిపింది. కల్నల్‌ ర్యాంకు నుండి బ్రిగేడియర్‌ ర్యాంకుకు పదోన్నతి పొందాలంటే అధికారులు కొన్ని అర్హతలు పొందాల్సి ఉంటుందని అటార్నీ జనరల్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన మహిళా అధికారి తరఫున న్యాయవాది అర్చనా పాఠక్‌ దేవ్‌ వాదనలు వినిపిస్తూ మహిళా అధికారులు తమకు రావాల్సిన పదోన్నతుల కోసం చాలా కాలంగా న్యాయస్థానాలలో పోరాడుతున్నారని చెప్పారు.

➡️