మున్సిపల్‌ కార్మికులపై పోలీసుల ప్రతాపం

  • విజయవాడ కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత
  • పలు జిల్లాల్లో అరెస్టులు
  • కొనసాగిన సమ్మె

ప్రజాశక్తి- యంత్రాంగం : మున్సిపల్‌ కార్మికులపై పలు జిల్లాల్లో పోలీసులు సోమవారం విరుచుకుపడి ప్రతాపం చూశారు. పలువురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. విజయవాడ కలెక్టరేట్‌ వద్ద పోలీసులు కర్కశంగా ప్రవర్తించడంతో ఉద్రిక్తత నెలకొంది. సమ్మె భాగంగా మున్సిపల్‌ కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. పోటీ కార్మికులను అడ్డుకున్నారు. వివిధ రూపాల్లో నిరసనలను కొనసాగించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ బందరు రోడ్డులోని కలెక్టరేట్‌ను ముట్టడించిన మున్సిపల్‌ కార్మికుల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. పిడిగుద్దులు గుద్దారు. మహిళా కార్మికులను జట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి పోలీసు వ్యానులు, ఆటోల్లో ఎత్తిపడేశారు. ఈ నేపథ్యంలో పలువురి మహిళా కార్మికుల దుస్తులు చిరిగిపోయాయి. పెనుగులాటలో పలువురి నాయకులకు, కార్మికులకు గాయాలయ్యాయి. పలువురు మహిళా కార్మికులను మహిళా కానిస్టేబుళ్లు బూట్‌ కాళ్లతో పొత్తి కడుపులో తన్నారు. దీంతో, పలువురు స్పృహ తప్పి పడిపోయారు. ఓ మహిళా కానిస్టేబుల్‌ రెండుసార్లు బలంగా పొత్తుకడుపులో తన్నడంతో సీత అనే కార్మికురాలు బిగ్గరగా ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను యూనియన్‌ నాయకులు అంబులెన్స్‌లో వైద్యశాలకు తరలించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, యూనియన్‌ నగర గౌరవాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, నగర అధ్యక్షులు ఎస్‌ జ్యోతిబాస్‌ సహా వందల మంది కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. వంగలకుమారి అనే మహిళా కార్మికురాలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను వైద్యశాలకు తరలించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని విడుదల చేశారు.

విశాఖలో జివిఎంసి పరిధిలోని మున్సిపల్‌ కార్మికులు కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి, అధ్యక్షులు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకుటి రాజుతోపాటు 300 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీసు బ్యారెక్స్‌ ప్రాంతంలోని కల్యాణ మండపానికి తరలించారు. సాయంత్రం వారిని విడిచిపెట్టారు. దీనికి ముందు మున్సిపల్‌ కార్మికులు సరస్వతీ పార్కు వద్ద సభ నిర్వహించారు. తగరపువలస మార్కెట్‌ వద్ద చెత్తను జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము పర్యవేక్షణలో వాహనంతో తరలిస్తుండగా అడ్డుకున్నారు.

విజయనగరం కలెక్టరేట్‌ను మున్సిపల్‌ పారిశుధ్య కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు ముట్టడించారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకర్రావు, యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్‌మోహన్‌రావుతో సహా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం, సాలూరు, పాలకొండల్లో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద బైఠాయించారు.

రాజమహేంద్రవరం, నంద్యాల, ఏలూరు, కడపా, రాయచోటి కలెక్టరేట్లు, కర్నూలులో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎదుట ధర్నా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సందర్శించి సంఘీభావం తెలిపారు. మున్సిపల్‌ కార్మికులు శ్రీకాకుళంలో ధర్నా, భిక్షాటన చేశారు. ఆమదాలవలసలో మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు ఐలూ రాష్ట్ర కమిటీ సభ్యులు బొడ్డేపల్లి మోహనరావు సంఘీభావం తెలిపారు. గుంటూరు, నరసరావుపేట కలెక్టరేట్ల వద్ద మున్సిపల్‌ కార్మికులు బైఠాయించారు. తిరుపతిలో కలెక్టరేట్‌ వద్ద జోరు వానలోనూ ధర్నా చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పంగనామాలు పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పాల్గొని మద్దతుగా మాట్లాడారు. ఏళ్ల తరబడి మున్సిపాల్టీలను నమ్ముకొని దళిత, గిరిజనులు, బలహీన వర్గాల వారు పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నారని, అలాంటి పేదల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం వివక్ష ప్రదర్శించడం దుర్మార్గమని అన్నారు. అనంతపురంలో కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. పుట్టపర్తి కలెక్టరేట్‌ ఎదుట కార్మికులు మూడు గంటల పాటు నిరసన తెలిపారు. వీరికి సిపిఎం, సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్‌ నుండి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ బైఠాయించి ధర్నా చేశారు.

శ్రీనివాసరావు, మధు పరామర్శ

పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన కార్మికులను, నాయకులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపి మధు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి మున్సిపల్‌ కార్మికులు, అంగన్‌వాడీలు పోరాడుతున్నారని తెలిపారు. అరెస్టుల ద్వారా వారి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే రానున్న రోజుల్లో జగన్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వారి సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరారు.

➡️