ప్లే స్కూల్‌ ఫీజు రూ.4.3 లక్షలు

Apr 15,2024 10:06 #fee, #Play school
  • బిడ్డ చదువు గురించి తండ్రి ట్వీట్‌ వైరల్‌
  • కార్పొరేట్‌ స్కూళ్ల దోపిడీపై ఆందోళన

న్యూఢిల్లీ : కొత్త విద్యా సంవత్సరం వచ్చేస్తోంది. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రుల కుస్తీలూ మొదలయ్యాయి. వీరిని నిలువు దోపిడి చేసేందుకు కార్పొరేట్‌ విద్యా సంస్థలు సిద్ధమయ్యాయి. గతేడాది కంటే దాదాపు 40 శాతం నుంచి 50 శాతం వరకు అధిక భారం మోపనున్నాయి. ఢిల్లీకి చెందిన ఆకాష్‌ కుమార్‌ అనే చార్టర్డ్‌ అకౌంటెంట్‌ పోస్టు చేసిన ‘ప్లే స్కూలు ఫీజు’ గురించి ఇప్పుడు నెట్టింట విస్తృత చర్చ నడుస్తోంది. ఆకాష్‌ తన తనయుడుని ఢిల్లీలోని ఒక కార్పొరేట్‌ ప్లే స్కూలులో చేర్పించారు. ఆ స్కూలు ఏకంగా రూ.4.3 లక్షలు ఫీజు వసూలు చేసింది. ‘నేను నా జీవితంలో చదివిన మొత్తం చదువుకు ఎంత ఫీజు చెల్లించానో.. అంతకంటే ఎక్కువగా నా బిడ్డ ప్లేస్కూల్‌ కోసం చెల్లిస్తున్నాను. ఆ స్కూల్లో కనీసం ఆడటం నేర్చుకుంటాడని నేను ఆశిస్తున్నాను’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఫీజు రసీదునూ ఆయన పోస్టు చేశారు. అందులో 2024 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి విద్యా సంవత్సరానికి ఫీజుల వివరాలను ఆ రసీదులో పేర్కొన్నారు. ఈ పోస్టు ఇప్పటికే 25 లక్షల మంది పైగా వీక్షించారు. మిగిలిన తల్లిదండ్రులు కూడా ఫీజుల కోసం తాము పడుతున్న కష్టాలను, విద్యావ్యవస్థను కార్పొరేటీకరించడం వల్ల జరుగుతున్న అన్యాయాన్ని, పెరుగుతున్న భారాలను తెలియజేస్తున్నారు. ఢిల్లీలో ఆకాష్‌ తరహాలోనే గుర్గావ్‌లోని ఒక వ్యక్తి ఇటీవల తన 3వ తరగతి కుమారుడి స్కూల్‌ ఫీజు నెలకు రూ. 30,000 చెల్లిస్తున్నట్లుగా పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

ప్లే స్కూలు బాదుడు ఇలా..
రిజిస్ట్రేషన్‌ ఫీజు (నాన్‌-రిఫండబుల్‌) – రూ.10వేలు
ఏడాది ఫీజు – రూ.25వేలు
టర్మ్‌-1 (ఏప్రిల్‌ – జూన్‌ 2024) – రూ.98,750
టర్మ్‌-2 (జులై- సెప్టెంబర్‌ 2024) – రూ.98,750
టర్మ్‌-3 (అక్టోబర్‌ -డిసెంబర్‌ 2024) – రూ.98,750
టర్మ్‌ -4 ( జనవరి – మార్చ్‌ 2025) – రూ.98,750
టోటల్‌ ఫీజు – రూ.4,40,000

➡️