రైల్వే జోన్‌పై పీయూష్‌ గోయల్‌వి అబద్ధాలు : బొత్స

YV Subbareddy's comments on joint capital were distorted

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :విశాఖ రైల్వే జోన్‌ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చెబుతున్నవన్నీ అబద్ధాలని, ఏమీ తెలియని అమాయకుడిలా ఆయన మాట్లాడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పీయూష్‌ గోయల్‌ రైల్వే మంత్రిగా ఉండి కూడా రైల్వే జోన్‌ ఎందుకు ఇవ్వలేదో తెలపాలని డిమాండ్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. రైల్వే జోన్‌ కోసం వైసిపి ప్రభుత్వం 52 ఎకరాల భూమి కేటాయించిందని, అడ్డంకులన్నీ తొలగించి రైల్వే జోన్‌ కోసం భూములు అప్పగించామని చెప్పారు. రాష్ట్రంలో తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చిన్న అవినీతి కూడా జరగలేదని బత్స చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు రికార్డు స్థాయిలో వచ్చాయని, పరీక్షల నిర్వహణ సజావుగా సాగిందని తెలిపారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులంతా బాధ్యతగా పనిచేశారన్నారు. రెండు, మూడు రోజుల్లో వైసిపి మేనిఫెస్టో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో విజయం సాధించే పార్టీ ఏదైనా వైసిపిపై ఆధారపడి పని చేసే విధంగా ఉండాలని తానూ కోరుకుంటున్నానని తెలిపారు. అలా వస్తే రాష్ట్రానికి రావాల్సిన మరిన్ని ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సమస్యలపై ఆలోచించడంలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బిజెపి హయాంలోనే ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో అతిపెద్ద అవినీతి జరిగిందని బత్స తెలిపారు.

➡️