అవయవ మార్పిడితో వ్యక్తిత్వ మార్పులు..

కోతి గుండెను అమర్చితే కోతిలా కిచకిచలాడుతారు అంటే.. అందులో నిజమెంతోగానీ.. ఇటీవల యూనివర్శిటీ ఆఫ్‌ కొలరాడో స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు అవయవ మార్పిడి గురించి పరిశోధనలు చేశారు. శస్త్రచికిత్స తర్వాత అవయవ గ్రహీతల వ్యక్తిత్వంలో మార్పులు గమనించినట్లు వారి నివేదిక వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

ఈ అధ్యయనంలో 47 మందిపై సర్వే నిర్వహించారు. వారిలో సగం మంది గుండె మార్పిడి, మిగిలినవారు ఇతర అవయవాల మార్పిడి చేయించుకున్నారు. ఆశ్చర్యమేమిటంటే వారిలో 89 శాతం మందిలో వ్యక్తిత్వ మార్పులను గుర్తించారు. ఆ మార్పులు కూడా స్వీకరించిన అవయవంతో సంబంధం లేనివి. కేవలం పాసింగ్‌ ఫాన్సీ (అలా కనిపించిపోయేవి) కాదు. ఈ మార్పులో అనుకూల, అననుకూలమైనవి రెండూ ఉన్నాయి.

అనుకూలమైనవి..
ఆహారం, సంగీతం, సాహిత్యం లాంటి కళల పట్ల వారిలో గణనీయమైన మార్పులు కలిగాయి. కొందరైతే వారి అలవాట్లు, జీవన విధానంలోనే పూర్తిగా కొత్త ఆసక్తులను వ్యక్తపరిచారు. అంతేకాదు. సామాజిక అంశాలపై మక్కువ చూపించటం, సామర్థ్యాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగటం లాంటివి కూడా నివేదిక తెలిపింది.

అననుకూలమైనవి..
అయితే ఈ సానుకూల మార్పులే కాక కొన్ని నష్టపరిచే మార్పులు కూడా నివేదికలో పేర్కొన్నారు. అవి మతిమరుపు, డిప్రెషన్‌, యాంగ్జయిటీ, సైకోసిస్‌ వంటి బాధాకరమైన పరిస్థితులూ ఎదురయ్యాయని అధ్యయనం పేర్కొంది.

సంబంధం లేని..
అత్యంత ఆసక్తికరమైన విషయం.. చాలా మంది గ్రహీతలు మార్పిడికి ముందున్న వారి భావాలతో సంబంధం లేని విషయాలపై ఆసక్తి కనబరచటం స్పష్టంగా వ్యక్తపరిచారు. ఎలాగంటే అవయవదాత లక్షణాలతో అనుసంధానించబడి ఉంటాయి. గుండె మార్పిడి గ్రహీతలలో నాలుగు, అంతకంటే ఎక్కువ రకాలు.. ఇతర అవయవాల గ్రహీతలలో నాలుగవ వంతు వ్యక్తిత్వ మార్పులను గుర్తించారు.
వాటిలో.. ఒక మరణించిన పోలీసు అధికారి గుండెను అమర్చుకున్న 56 ఏళ్ల ప్రొఫెసర్‌ అధ్యయనంలో.. పోలీసు వృత్తిలో మరల మరల గుర్తు చేసుకోవాల్సిన అంశాలు (దారుణంగా కాల్చివేసినట్లున్న ముఖం), మరికొన్ని పోలీసు వృత్తిపరమైన విషయాలు కలల రూపంలో వ్యక్తమయ్యాయి.

ఇతర అవయవాలైతే..
అలాగే కాలేయం, కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తులు మానసిక, న్యూరోసైకియాట్రిక్‌ ప్రాబ్లమ్స్‌.. అంటే నిరాశ, నిద్రలేమి, ఆందోళన, పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (భయంకరమైన సంఘటనలు తన అనుభవంలో కానీ, మరొకరి విషయంలో చూడటం కానీ) లక్షణాలను వ్యక్తపరిచారు.

భావోద్వేగాలు..
ప్రస్తుత అధ్యయనం.. మానవ శరీర అవయవ వ్యవస్థ (విసెరల్‌ సిస్టమ్‌) కు, భావోద్వేగాలకు నిర్దిష్టమైన పరిస్థితులున్నాయి అంటుంది. అంటే కాలేయానికి అనుగుణంగా కోపం.. గుండె- ఆనందం, ప్లీహం- ఆలోచనలు, బాధ.. ఎక్కువ మందిలో వ్యక్తమయ్యాయని నివేదిక వెల్లడించింది.

మార్పిడిలో ప్రతికూలతలు..
అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలో గ్రహీత శరీరం అవయవాన్ని తిరస్కరించినప్పుడు వ్యతిరేక తిరస్కరణ మందులు (ఇమ్యునో సప్రెసెంట్స్‌) వాడతారు. అవి గ్రహీత రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తాయి. అంతేకాక ఇన్ఫెక్షన్లు, కొన్ని క్యాన్సర్ల వంటి దుష్ప్రభావాలను కలిగిస్తాయి.
కొన్నిసార్లు సానుకూలమైన, మరికొన్ని సార్లు కలవరపెట్టే ఈ వ్యక్తిత్వ మార్పులు.. పరిణామాలపై పూర్తి స్పష్టత లేదని.. అవయవ దాత గురించి గ్రహీత చేసే ఆలోచనలు అలా వ్యక్తీకరించే అవకాశాలుండి ఉండవచ్చని.. అయితే పూర్తిస్థాయిలో పరిశోధనలు కొనసాగించాల్సి ఉందని బృందం పేర్కొంది.

➡️