ప్రతి విద్యార్థికీ శాశ్వత విద్య నెంబరు

  • మరో పాఠశాలలో చేర్చుకోవడంలో ఆలస్యం వద్దు
  • పాఠశాల విద్య కమిషనరు సురేష్‌ కుమార్‌ ఆదేశాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికీ శాశ్వత విద్య నెంబరు (పెన్‌) ఉండాలని పాఠశాల విద్యాశాఖ కమిషనరు సురేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖ అధికారులకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటో తరగతి అడ్మిషన్‌ సమయంలో విద్యార్థికి కేటాయించిన సంఖ్య వారి చదువు పూర్తయ్యేంత వరకు అలాగే ఉంటుందని తెలిపారు. విద్యామంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం యుడైస్‌ పోర్టల్‌ ద్వారా విద్యార్థులకు దీనిని అందిస్తోందని తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు మినహా మిగిలిన వారందరికీ పెన్‌ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. ప్రతి విద్యాసంవత్సరంలో విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయడం, ఇతర పాఠశాలలకు బదిలీ చేసేందుకు రికార్డు షీట్‌, టిసి, కుల, జనన ధ్రువీకరణ పత్రాల వంటి వాటికోసం పట్టుబట్టకుండా అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రవేశం కల్పించాలని ఆదేశించారు. కొత్త పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ఆలస్యం చేయడం వల్ల 2, 5, 7, 8 తరగతుల విద్యార్థుల బదిలీలు సక్రమంగా జరగడం లేదని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో టిసి సౌకర్యం ఉన్నప్పటికీ కొన్ని పాఠశాలలు పాత విధానాన్ని అనుసరిస్తుండడంతో ఆయా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం వీటిని అధిగమించేందుకు, కొత్త తరహా ‘విద్యార్థుల బదిలీ ప్రక్రియ’ సులభతరం చేయడానికి ట్యాగింగ్‌ చేసినట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ఆప్షన్‌ ఫారం తెప్పించుకుని సంబంధిత పాఠశాలలను లాగిన్‌లో నమోదుచేయాలని పేర్కొన్నారు. ఆప్షన్‌ ఫారం బట్టి ఎంపిక చేసిన పాఠశాలలకు బదిలీ చేయబడుతుందని వివరించారు. రాష్ట్రంలోని ప్రైవేట్‌ అన్‌-ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి ప్రారంభ అనుమతి, గుర్తింపు, గుర్తింపు పునరుద్ధరణ కోసం స్వీకరించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులు సకాలంలో పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని కమిషనరు ఆదేశించారు.

➡️