కష్ట కాలంలో.. సర్కారు ఎక్కడ? : చంద్రబాబునాయుడు ప్రశ్న

ప్రజాశక్తి-అమర్తలూరు, తెనాలి : తుపాన్‌తో జన జీవితం అతలాకుతలమౌతుంటే ప్రభుత్వం ఎక్కడుంది… ఏం చేస్తోంది? అని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ మండలం నందివెలుగు, పెదరావూరు, బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, అమర్తలూరు మండలం, కూచిపూడి పెదపూడి గ్రామాలలో దెబ్బతిను పంట పొలాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. రైతుల నుండి వివరాలు సేకరించారు. పలుచోట్ల బాధితుల నుద్ధేశించి మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన హుద్‌హుద్‌ తుపాన్‌ సమయంలో రెండోరోజే ప్రధాన మంత్రిని రాష్ట్రానికి తీసుకువచ్చామని చెప్పారు. ప్రస్తుత గాడి తప్పిన పాలనలో ఇంతవరకు కేంద్ర బలగాలు కూడా రాలేదని అన్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు గుంటూరు జిల్లాలో 90 శాతం పంట నీటిపాలైందన్నారు. ఇక్కడ మానవ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పంట కాలువలు, డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో ఆ ప్రభావం రైతులపై పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చెల్లించాల్సిన ఫసల్‌ బీమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. 2014కు ముందు ఇన్‌పుట్‌సబ్సిడీ ఎకరానికి రూ 10 వేలు చెల్లిస్తుంటే దానిని తన హయాంలో రూ.20 వేలకు పెంచామన్నారు. ఆ ప్రకారం ప్రస్తుతం ఎకరానికి కనీసం రూ.30 వేలైనా పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పంట నష్టపోయిన రైతుల ఆధారాలు తమ వద్ద ఉంచుకోవాలని, వారికి న్యాయం జరిగేలా తాను పోరాడతానని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించకుంటే, మరో మూడు నెలల్లో తమ ప్రభుత్వం వస్తుందని, ఆ వెంటనే రైతులను ఆదుకుంటామని చెప్పారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పు చేయకపోయినా, అక్రమ కేసులు బనాయించి 52 రోజులు జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే తెలంగాణ మాదిరి ఫలితాలే ఎదురవుతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, సీనియర్‌ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️