50 ఏళ్లకే పింఛను : పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు

Mar 6,2024 08:59 #50, #age, #increased, #Pension, #wedding gift
  • రూ.5 వేల కోట్లతో ఆదరణ
  • చట్టబద్దంగా కులగణన
  • డిక్లరేషన్‌ ప్రకటించిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తాము అధికారంలోకి వస్తే బిసిలకు 50 సంవత్సరాలకు పింఛను ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నాగార్జున యూనివర్శిటి ఎదురుగా ఉన్న మైదానంలో మంగళవారం జరిగిన జయహో బిసి సభలో ఈ మేరకు రూపొందించిన బి.సి డిక్లరేషన్‌ను వారు విడుదల చేశారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెప్పేందుకే సమిష్టిగా డిక్లరేషన్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో బిసిల దశ, దిశలను మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. బిసిలకు 50 సంవత్సరాలకే పెన్షన్‌ అమలు చేయడంతో పాటు నెలకు పెన్షన్‌ రూ.4వేలకు పెంచుతామని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి తరహాలో ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని, సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులను కాపాడతామని అన్నారు. బిసి సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు బిసిల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్ధానిక సంస్ధల్లో బిసి రిజర్వేషన్‌ను వైసిపి ప్రభుత్వం 34శాతం నుంచి 24శాతానికి తగ్గించడంతో 16,800 పదవులు బిసిలకు దూరమయ్యాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 34శాతం రిజర్వేషన్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు. చట్ట సభల్లో బిసిలకు 33శాతం రిజర్వేషన్‌ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీచేయలేని వర్గాలను కో ఆప్షన్‌ సభ్యులుగా, నామినేటెడ్‌ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు, దామాషా ప్రకారం నిధులు కేటాయింపులతోపాటు స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల ఖర్చు చేస్తామన్నారు. జగన్‌ ఫ్రభుత్వం రద్దు చేసిన ఆదరణ పథకాన్ని తిరిగి రూ.5 వేలకోట్లతో పునరుద్ధరిస్తామన్నారు. హడావిడిగా కాకుండా చట్టబద్ధంగా కులగణను నిర్వహిస్తామని చెప్పారు. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ, నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్‌ స్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయడం, షరతులు లేకుండా విదేశీ విద్య అమలు, పిజి విద్యార్ధులకు కూడా ఫీజురీయంబర్స్‌మెంట్‌ మెరిట్‌ పునరుద్దరణ, స్టడీ సర్కిల్‌, విద్యోన్నతి పథకాలు పున:ప్రారంభిస్తామని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి నలుగురు రెడ్లతో పెత్తందారీ రాజకీయాలను చేస్తున్నారని తెలిపారు. మంగళగిరిలో 20 వేల టిడ్కో ఇళ్లు నిర్మించడంతోపాటు మంగళగిరిలో నివాసం ఉండే ప్రతి ఒక్కరికీ హక్కులు కల్పిస్తూ ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పారు. అమరావతి (తాడేపల్లి) పరిధిలో యు వన్‌ను ఎత్తివేస్తామని, తద్వారా భూములు అమ్ముకోవచ్చన్నారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. శాసించే స్ధాయికి బిసిలు : పవన్‌కల్యాణ్‌బిసిలకు సాధికారత ఉండాలని, యాచించే స్థాయి నుంచి శాసించే స్ధాయికి రావాలని జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ సంపద సృష్టించే స్థాయికి ఎదిగేలా బిసిలకు అండగా ఉంటామని చెప్పారు. మత్స్యకారుల కోసం తీర ప్రాంతంలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక జెట్టీ ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. వైసిపి పాలనలో 300మంది బిసిలను చంపేశారని, వైసిపిలో ఉన్న బిసి నేతలు కూడా పునరాలోచించుకోవాలని సూచించారు. బడ్జెట్‌లో మూడో వంతు బిసిలకే అనిచెప్పి పూర్తిగా విస్మరించారన్నారు. బిసిలకు రక్షణ చట్టం అవసరమని, అందుకే తాను మద్దతు తెలిపానన్నారు. టిడిపి, జనసేన ప్రభుత్వం వడ్డెర కులస్థులకు ఆర్థిక పరిపుష్టి కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తుందని పవన్‌ తెలిపారు. బిసిలు ఐక్యంగా ఉండి టిడిపి, జనసేన కూటమిని గెలిపించుకోవాలని కోరారు. గంగవరం నిర్వాసితులు సహా అందరికీ న్యాయం చేస్తామన్నారు. తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల పిల్లలకు ఆదర్శపాఠశాలలు నిర్మిస్తామని వెల్లడించారు. ఈ సభలో సీనియర్‌ నేతలు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కొణతాల రామకృష్ణ, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు, నిమ్మల కిష్టప్ప, బీదా రవిచంద్ర, కాలవ శ్రీనివాసులు, గౌతు శిరీష, కిమిడి కళా వెంకటరావు, కూన రవికుమార్‌, పితాని సత్యనారాయణ, శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పంచుమర్తి అనూరాధ, దువ్వారపు రామారావు, జనసేన నేతలు పోతిన మహేష్‌, బి.శ్రీనివాసయాదవ్‌, బొమ్మిడి నాయకర్‌, సిహెచ్‌ శ్రీనివాస్‌ ప్రసంగించారు.

➡️