ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య సంధికి యత్నాలు

Dec 22,2023 10:27 #Israel, #israel hamas war
peace agreement btw israel hamas

గాజా నుంచి మరింత మందిని ఖాళీ చేయించే పనిలో నెతన్యాహు

గాజా సిటీ: రెండు మాసాలుగా సాగుతున్న ఇజ్రాయిల్‌ దురాక్రమణ పూరిత దాడులను ఆపాలని, హమాస్‌, ఇజ్రాయిల్‌ మధ్య సంధికి దౌత్య మార్గాల ద్వారా యత్నించాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒక వైపు ఒత్తిడి పెరుగుతుంటే, మరో వైపు గాజాలో మరిన్ని కుటుంబాలను తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లి పోవాలని ఫాసిస్టు నెతన్యాహు ప్రభుత్వం గురువారం హుకుం జారీ చేసింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ గాజాలో దాడులను ఆపి ”స్థిరమైన సంధి”ని కుదుర్చుకోవాలని పిలుపునిచ్చాయి. ఇజ్రాయిల్‌ దాడుల్లో ఇప్పటివరకు 20 వేల మందికిపైగా పాలస్తీనీయులు చనిపోయారు. వీరిలో 8,000 మంది చిన్నారులు, 6,200 మంది మహిళలు ఉన్నారు. మరో 1,40,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వీరు ఆశ్రయం పొందుతున్న ఖాన్‌ యూనిస్‌లోని భూ భాగం నుంచి కూడా తరిమేయాలని ఇజ్రాయెల్‌ చూస్తోంది. ఇదిలా ఉండగా దీర్ఘకాలిక కాల్పుల విరమణ కోసం చర్చలు ఊవందుకున్నాయి. పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ అధినేత ఈజిప్ట్‌ను సందర్శించి యూరప్‌ దౌత్యవేత్తలతో చర్చలు జరుపుతుండడంతో ఇజ్రాయెల్‌ -హమాస్‌ మధ్య మరో సారి కాల్పుల విరమణ, పరస్పర బందీల విడుదలకు అవకాశాలు మెరుగయ్యాయని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఖతార్‌కు చెందిన హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే బుధవారం ఈజిప్టుకు వచ్చి ఆ దేశ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అబ్బాస్‌ కమెల్‌తోను, ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్‌-అబ్దుల్లాహియాన్‌ తదితరులతో చర్చలు జరిపారు. ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు మాట్లాడుతూ, హమాస్‌ను గాజా నుంచి తరిమేసే దాకా కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని పాత పాటే పాడారు. ఈజిప్ట్‌ , అమెరికా మద్దతుతో ఖతార్‌, గత నెలలో 240 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా 80 మంది ఇజ్రాయెలీ బందీలను విడిపించిన మొదటి వారంలో కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది.

➡️