ధాన్యం కొనుగోలుపై శ్రద్ధేదీ ?

Apr 13,2024 08:14 #grain, #Purchase
  • ఆశాజనకంగా రబీ దిగుబడులు
  • ఏటా రైతులను వెంటాడుతున్న గోనె సంచులు, రవాణా సమస్య

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : ఎన్నికల వేళ ధాన్యం కొనుగోలుపై అధికారులు దృష్టి సారించకపోవడంతో రైతులు ఆందోళనతో ఉన్నారు. ఎన్నికల బిజీలో అధికారులు తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. గత సీజన్లలో ధాన్యం అమ్మకాల్లో ఎదురైన ఇబ్బందులను గుర్తు చేసుకుంటున్నారు. వాటిని ఈసారి నివారించాలని కోరుతున్నారు. రబీలో ఏలూరు జిల్లాలో 80 వేల ఎకరాల్లో, పశ్చిమగోదావరి జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఏలూరు జిల్లాలో 3.12 లక్షల టన్నులు, పశ్చిమగోదావరి జిల్లాలో 7.20 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఎకరాకు 50 నుంచి 60 బస్తాల వరకూ దిగుబడి వస్తోంది. దిగుబడి ఆశాజనకంగా ఉన్నా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. ఈ రెండు జిల్లాల్లో ఈ నెల ఆరు నుంచి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకూ ఈ జిల్లాల్లో రెండు వేల టన్నుల చొప్పున మాత్రమే కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో, దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏలూరు జిల్లాలో 239 ఆర్‌బికెలు, పశ్చిమలో 306 ఆర్‌బికెల్లో ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. రబీ మాసూళ్లు ముమ్మరంగా ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ చాలాచోట్ల సక్రమంగా కొనుగోళ్లు జరగడం లేదు. ఇందుకు సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం వాతావరణలో మార్పు రావడంతో ధాన్యాన్ని దళారులను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. గతేడాది రబీలో అకాల వర్షం ముంచెత్తింది. దీంతో, ధాన్యాన్ని రక్షించుకోవడానికి, తడిచిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ దృష్ట్యా ఈ రబీలో మాసూళ్లూ పూర్తయిన వెంటనే ధాన్యాన్ని విక్రయించేస్తున్నారు. దీన్ని దళారులు తమకు అనుకూలంగా మార్చుకొని రైతులను దోపిడీ చేస్తున్నారు. దీంతో, 75 కిలోల బస్తాకు రూ.400 వరకూ రైతులు నష్టపోతున్నారు.

గోనె సంచులు, రవాణా సమస్యలే కీలకం
ధాన్యం కొనుగోలులో రైతులకు ప్రధానంగా గోనె సంచులు, రవాణా సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. గత మూడు సీజన్లలోనూ ఇవే సమస్యలు వచ్చినా పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారు. ఏలూరు జిల్లాలో లారీల కోసం రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. గోనె సంచుల కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది. ప్రతి గింజా కొనుగోలు చేస్తామంటూ అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నా, ఆచరణ అందుకు భిన్నంగా ఉంటోంది. ఏలూరు జిల్లాలో 2.40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. గోనె సంచుల కొరత, రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

మిల్లర్లకు ఎదురు స ొమ్ములిచ్చే దుష్ట సంస్కృతికి చెక్‌ పడేనా ?
తేమ శాతం 17కు మించితే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తీసుకోవడం లేదు. ఆర్‌బికెలో అధికారులు తేమ శాతం నిర్థారించిన తర్వాత కూడా తేమ శాతం ఎక్కువగా ఉందంటూ రైతుల నుంచి డబ్బులను మిల్లర్లు వసూలు చేస్తుండడం గత మూడు సీజన్లలో కొనసాగింది. ఎక్కువగా ఉందని మిల్లర్లు చెప్పిన తేమ శాతానికి సంబంధించిన డబ్బులను రైతుల నుంచి వసూలు చేసిన తర్వాతే ధాన్యం తీసుకుంటున్నారు. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్‌బికె అధికారులు నిర్థారించిన తేమ శాతానికి, మిల్లర్లు చూపుతున్న తేమ శాతానికి ఎందుకు తేడా వస్తుందో అధికారులు చెప్పడం లేదు. అదేమని అడిగితే మరో రెండు రోజులు ఆరబెట్టాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. మిల్లర్లకు ఎదురు సొమ్ములు ఇచ్చే పరిస్థితి లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

➡️