బకాయి వేతనాలు చెల్లించండి

Apr 8,2024 23:19
మాట్లాడుతున్న ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరు జిల్లాలో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌కి మూడు నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించి, పనివారాన్ని తగ్గించాలని ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో డిఎంహెచ్‌ఓకు ఆశాలతో కలిపి వినతి పత్రం అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఇటీవల కాలంలో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశామన్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి ఒప్పుకున్న డిమాండ్లు పరిష్కరించాలని తెలిపారు. ఆశాలతో సబ్‌ సెంటర్ల వద్ద పారిశుధ్య పనులు చేయిస్తున్నారని తెలిపారు. రికార్డులు కొనుక్కోమని బలవంతంగా ఒత్తిడి తీసుకొస్తున్నారని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ ఫోన్లు పని చేయక పోయినా సొంత ఫోన్లు కొనుక్కొని పని చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శించారు.సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు, ఆశ యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంగమ్మ, దాసమ్మ పాల్గొన్నారు.

➡️