భీమవరంలో పవన్‌ కల్యాణ్‌ సుడిగాలి పర్యటన

Feb 21,2024 20:08 #bhimavaram, #JanaSena, #pavan kalyan

– టిడిపి ముఖ్య నేతలతో భేటీ

ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి) నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని టిడిపి, జనసేన నేతలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. పొత్తు నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య ఏవైనా సమస్యలుంటే పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల టిడిపి ఇన్‌ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో పవన్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ, ఉండి, పాలకొల్లు ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు వేటుకూరి వెంకట శివరామరాజు, ఆరిమిల్లి రాధాకృష్ణ పలువురు నాయకులు పాల్గన్నారు. సుమారు గంటకుపైగా ఇరు పార్టీల ముఖ్య నేతలతో వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. పవన్‌ మాట్లాడుతూ..ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయొద్దని తాను చెప్పలేదని, ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేస్తారో లేదో అది మీ నిర్ణయం అని వ్యాఖ్యానించారు. ఓట్లు కొనలేని నియోజకవర్గాలు ఉంటే సంతోషమన్నారు. జగన్‌ తనకు వ్యక్తిగత శత్రువు కాదని విధానాలు అత్యంత దారుణంగా ఉన్నాయని విమర్శించారు. వ్యక్తిగత లబ్ధి కోసం కులాలను విచ్ఛినం చేస్తు కులాలను విడగొడుతున్నారని ఆరోపించారు. అయితే పవన్‌ భీమవరం నుంచి పోటీ చేస్తానని అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ భీమవరంలో రాజకీయ ప్రముఖులను కలుసుకోవడంతో ఇక్కడి నుంచే పోటీకి దిగుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వచ్చాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తున్నానని, తనకు అన్ని విధాలా సహకారం అందించాలని పవన్‌ కోరినట్లు తెలిసింది.

➡️