రోగుల ప్రాణాలు గాలిలో….

  •  పిఎంజెఎవై కింద ఆస్పత్రులకు అందని నిధులు
  •  కేటాయింపుల్లోనూ కోత పెడుతున్న ప్రభుత్వం
  •  అప్పుల ఊబిలో ఆస్పత్రులు
  •  వైద్య సేవల నిలిపివేత

న్యూఢిల్లీ : ‘ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన’ (పిఎంజెఎవై) పథకం కింద వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్యను పలు రాష్ట్రాలలోని ఆస్పత్రులు తగ్గిస్తున్నాయి. సకాలంలో కేంద్రం నుండి రీయంబర్స్‌మెంట్‌ రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. కేంద్రం నుండి నిధుల విడుదలలో తీవ్రమైన జాప్యం ఏర్పడుతుండడంతో ఆస్పత్రులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఈ పథకం కింద రోగులను ఇకపై చేర్చుకునే ప్రశ్నే లేదని తేల్చి చెబుతున్నాయి.
అహ్మదాబాద్‌లోని బాడీలైన్‌ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి గత ఆరు సంవత్సరాలుగా ప్రతి నెలా 600 మంది రోగులకు ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందిస్తోంది. డయాలసిస్‌ కోసం ఆస్పత్రికి వచ్చిన ప్రతిసారీ రోగికి రూ.300 చొప్పున రవాణా ఖర్చులు చెల్లిస్తోంది. దీనికి ప్రతిఫలంగా ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన పథకం కింద కేంద్రం ఈ ఆస్పత్రికి ప్రతి డయాలసిస్‌ సెషన్‌కూ రూ.2,200 అందిస్తోంది. ఈ నగదు రహిత బీమా పథకం కింద పేదలకు వైద్య చికిత్స నిమిత్తం ఐదు లక్షల రూపాయల వరకూ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇదంతా ఒకప్పటి మాట.
తగ్గిపోతున్న రీయంబర్స్‌మెంట్‌
గత రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రీయంబర్స్‌మెంట్‌ సొమ్ము తగ్గిపోతోంది. మరోవైపు డయాలసిస్‌ యంత్రాల నిర్వహణ వ్యయం, వైద్య పరికరాల ఖర్చు, సిబ్బంది జీతాలు మాత్రం యధావిధిగానే ఉంటున్నాయి. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఆస్పత్రి విలవిలలాడుతోంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకూ కేంద్రం నుండి ఈ ఆస్పత్రికి రూ.3.4 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వంద మంది రోగులపై ఖర్చు చేస్తుంటే 30 మంది రోగుల బిల్లులు మాత్రమే వస్తున్నాయని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ఈ పథకం కింద వైద్య సేవలు అందజేస్తున్న అన్ని ఆస్పత్రుల పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క గుజరాత్‌లోని ఆస్పత్రులకే 2021 నుండి 2023 జూలై వరకూ రూ.300 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుండి నిధులు అందకపోవడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు రోగులకు చికిత్సలు నిలిపివేస్తున్నాయి.
గుజరాత్‌లోని 300 బాధిత ఆస్పత్రులు గత సంవత్సరం ఓ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. పెండింగ్‌ నిధులను రాబట్టుకునేందుకు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే అనేక ఆస్పత్రులు ఈ పథకం కింద వైద్య సేవలను నిలిపివేశాయి. చెల్లింపులలో జాప్యం, క్లెయిముల తిరస్కరణ కారణంగా ఆస్పత్రులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని ఓ వైద్యశాల నిర్వాహకుడు వాపోయారు.
అన్ని రాష్ట్రాలలోనూ ఇంతే…
ఇది ఒక్క గుజరాత్‌ ఆస్పత్రుల సమస్యే కాదు. ఈ పథకం కింద రోగులకు చికిత్స అందజేస్తున్న ఇతర రాష్ట్రాలలోని ఆస్పత్రులు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. హర్యానాలో 983 ఆస్పత్రులు ఈ పథకం కింద వైద్య సేవలు అందజేస్తున్నాయి. ఈ నెల 15 లోగా బకాయిలు చెల్లించకపోతే చికిత్సలు ఆపేస్తామని అవి హెచ్చరించాయి. రాష్ట్రంలోని ఆస్పత్రులకు రూ.200 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. కేరళలోని ఆస్పత్రులు ఓ అడుగు ముందుకు వేసి హైకోర్టును ఆశ్రయించాయి. తమిళనాడులోని ఆస్పత్రులకు ఈ పథకం కింద బకాయిలు పెరిగిపోతున్నాయి.
క్లెయిముల తిరస్కరణ…పరిష్కారంలో జాప్యం
2021 నుంచి ప్రధానంగా రెండు సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆస్పత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. క్లెయిముల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని, అనేక క్లెయిములను తిరస్కరిస్తున్నారని లేదా చెల్లింపుల్లో కోత విధిస్తున్నారని అవి వివరించాయి. శస్త్ర చికిత్సలు చేసిన పదిహేను రోజుల్లోగా నిధులు విడుదల కావాల్సి ఉండగా గుజరాత్‌ ఆస్పత్రులకు కేవలం 5 శాతం మాత్రమే రీయంబర్స్‌మెంట్‌ వస్తోంది. ఇన్సూరెన్స్‌ కంపెనీలు చిన్న చిన్న కారణాలు చూపుతూ క్లెయిములను తిరస్కరిస్తున్నాయి. తొలుత శస్త్రచికిత్సకు అనుమతి ఇచ్చి తీరా చేసిన తర్వాత చెల్లింపుల్లో కోత పెడుతున్నాయి.
దేశంలో ఈ పథకం కింద ఆస్పత్రుల్లో ప్రవేశాలు పొందిన రోగుల సంఖ్య 2021 మధ్యకాలం వరకూ బాగా పెరిగింది. కానీ అప్పటి నుండి బాగా తగ్గిపోయింది. గత సంవత్సరం అక్టోబరులో 13.16 లక్షల మంది రోగులు చేరగా నవంబర్‌ నాటికి ఆ సంఖ్య 6.4 లక్షలకు పడిపోయింది. కనీసం పది రాష్ట్రాల్లో సగం మంది రోగులకు సంబంధించిన క్లెయిముల పరిష్కారానికి 45 రోజుల కంటే ఎక్కువ సమయమే పడుతోంది.
బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ కోతే
పథకం నిర్వహణ సరిగా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పలు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. అవసరమైన దాని కంటే బడ్జెట్‌ కేటాయింపులు తక్కువగా ఉన్నాయని, ఆ కేటాయింపులను కూడా సరిగా ఉపయోగించడం లేదని అంటున్నాయి. 2023-24లో ప్రభుత్వం ఈ పథకానికి రూ.7,200 కోట్లు కేటాయించినా ఆ తర్వాత దానిని రూ.6,800 కోట్లకు సవరించింది. 2022-23లో ఈ పథకానికి బడ్జెట్‌లో కేటాయించింది రూ.6,412 కోట్లు. కానీ తొమ్మిది నెలల్లో విడుదల చేసింది కేవలం 18 శాతం మాత్రమే. కేరళలో గత ఆరు నెలల కాలంలో 42 ఆస్పత్రులు ఈ పథకం నుంచి వైదొలిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.

➡️