పాక్‌ ఎన్నికల్లో పోటీకి .. ముంబయి ఉగ్రదాడి కీలక సూత్రధారి పార్టీ

ఇస్లామాబాద్‌ :   వచ్చే ఏడాది జరగనున్న పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు 26/11 ముంబయి ఉగ్రదాడి కీలక సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ పార్టీ ప్రకటించింది. దేశాన్ని ఇస్లామిక్‌ సంక్షేమ రాజ్యంగా మార్చాలనుకుంటున్నట్లు తెలిపింది. ఉగ్రవాదులకు నిధులు అందించారన్న కేసులో లష్కరే-తొయిబా వ్యవస్థాపకుడైన సయీద్‌తో పాటు నిషేధిత జమాత్‌ ఉద్‌ దవాకు చెందిన పలువురు నేతలు దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 2019 నుండి జైలులో ఉన్నారు. 2018లో ఈ సంస్థపై నిషేధం విధించారు.

అనంతరం ”పాకిస్థాన్‌ మర్కజీ ముస్లిం లీగ్‌ (పిఎంఎంఎల్‌)” పార్టీ ఏర్పాటైంది. ఈ పార్టీ ఎన్నికల గుర్తు కుర్చీ. ఇది రాజకీయ పార్టీ అని, అన్ని జాతీయ, ప్రావిన్షియల్‌ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని పిఎంఎంఎల్‌ అధ్యక్షుడు ఖలీద్‌ మసూద్‌ సింధు ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. సయీద్‌ ఉగ్ర సంస్థతో పార్టీకి ఎలాంటి సంబందం లేదని ప్రకటించారు. సయీద్‌ కుమారుడు తల్హా సయీద్‌ ఎన్‌ఎ-127 స్థానం నుండి బరిలోకి దిగుతున్నారు.

ప్రజలకు సేవ చేయాలని, పాకిస్థాన్‌ను ఇస్లామిక్‌ సంక్షేమ రాజ్యంగా మార్చాలని తాము అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని సింధు పేర్కొన్నారు. ఖలీద్‌ మసూద్‌ సింధు ఎన్‌ఎ-130 లాహోర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఇదే స్థానం నుండి పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ -నవాజ్‌ (పిఎంఎల్‌ఎన్‌) అధ్యక్షుడు మరియు మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పోటీ చేస్తున్నారు.

➡️