పోస్టల్‌ బ్యాలెట్‌లపై పార్టీల దృష్టి!

Apr 8,2024 23:53

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వినియోగించే పోస్టల్‌ బ్యాలెట్‌లపై రాజకీయపార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఉద్యోగులను అకట్టుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఎవరెవరు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకుంటారో వారివివరాలు సేకరిస్తున్నారు. వీరిని స్వయంగా కలిసి తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పోలింగ్‌ తేదీ నాడు ఎన్నికల విధుల్లో ఉండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌లను వినిగించుకునే అవకాశం ఉంది. దాదాపు 25 వేల మంది వరకు జిల్లాలో ఉద్యోగులు, అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనడం వల్ల వీరి ఓట్లను తమకు అనుకూలంగా పడేలా చూసుకోవడానికి రాజకీయ పార్టీలు దృష్టిసారించాయి. గత ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ను సరిగా లెక్కించకపోవడం వల్లే తాము ఓడిపోయామని వైసిపి అభ్యర్థులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం అన్నారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి న్యాయస్థానంను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి అభ్యర్థులుతగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు,అధికారులకు మేనెల 5 నుంచి 8వ తేదీవరకు కేటగిరి వారీగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరులోని కొన్ని కళాశాలల్లో ఇందుకోసం పరిశీలిస్తున్నారు. తొలిరోజు పోలింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులు, మైక్రోఅబ్జర్వర్లు, 6వ తేదీన అదర్‌ పోలింగ్‌ అధికారులు, 7వ తేదీన పోలీసులు, ఇతర ఉద్యోగులు, 8వ తేదీన ఇతర జిల్లాలకు చెందిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఎన్నికలకమిషన్‌ సూచించింది. గుంటూరు లోక్‌సభ పరిధిలో 1884 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని కేంద్రాల్లో 1300 కంటే ఎక్కువ ఓటర్లున్న పోలింగ్‌ కేంద్రాలు 31 వరకు ఉన్నట్టు జిల్లా అధికారులు గుర్తించారు. ఈ మేరకు 31 కేంద్రాలు అదనంగా ఏర్పాటుకు ఎన్నికల కమిషన్‌కు జిల్లా అధికారులు ఇటీవల ప్రతిపాదనలు పంపారు. ఎన్నికల కమిషన్‌ అనుమతిస్తే జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 1915కి పెరిగే అవకాశం ఉంది. ఒక్కోకేంద్రంలో ఆరుగురు సిబ్బందితోపాటు 20 శాతం రిజర్వు సిబ్బందితో కలిపి మొత్తం 13900 మంది సిబ్బంది అవసరం అవుతారని అంచనా వేశారు. వీరిలో పాటు ఇతర అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, అగ్నిమాపక శాఖతో పాటు వివిధ శాఖల ఉద్యోగులతో కలిపి మొత్తంగా 25 వేల వరకు ఉంటారని అంచనా. విధులు కేటాయించిన తరువాత కూడా గైర్హాజరు అయితే ఇబ్బంది లేకుండా ఉండేందుకు 20 శాతం రిజర్వు ఉద్యోగులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. వీరంతా పోలింగ్‌ రోజున వారి స్వస్థలంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశంలేకపోవడం వల్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. పోలింగ్‌ సిబ్బందికి కూడా ఎన్నికల విధుల కేటాయింపులో జంబ్లింగ్‌ విధానం అవలంభించనున్నారు. పోలింగ్‌ సిబ్బంది జన్మస్థలం, నివశించే ప్రాంతం ఉన్న నియోజకవర్గంలో వారికి ఎన్నికల విధులు కేటాయించరు. మరొక నియోజకవర్గంలో విధులు కేటాయిస్తారు. అందువల్ల ఉద్యోగులు వారికి ఓటు ఉన్న నియోజకవర్గంలోనే పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవడానికి ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

➡️