1,893 గ్రామాల్లో పంచాయతీ భవనాల్లేవ్‌ !

Dec 7,2023 09:15 #Parliament Session
parliament session on budget

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో 1,893 గ్రామాలకు సొంత పంచాయతీ భవనాలు లేవని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ తెలిపారు. రాజ్యసభలో వైసిపి ఎంపి వేంరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎపిలో 13,325 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 1,893 గ్రామాలకు సొంత పంచాయతీ భవనాలు లేవని తెలిపారు. అలాగే 2023-24లో ఇప్పటి వరకు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియన్‌ (ఆర్‌జిఎస్‌ఎ), 15 ఆర్థిక సంఘం నిధులు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని తెలిపారు. 2022-23లో రూ.393.92 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. గతేడాది కూడా ఆర్‌జిఎస్‌ఎ నిధులు విడుదల చేయలేదని తెలిపారు. దేశంలో 6,64,448 గ్రామాలుండగా, అందులో 2,69,073 గ్రామ పంచాయతీలు(జిపి), గ్రామీణ స్థానిక సంస్థలు (ఆర్‌ఎల్‌బి) ఉన్నాయని, 2,33,634 గ్రామ పంచాయతీల్లో సొంత భవనాలు ఉన్నాయని మరో ప్రశ్నకు తెలిపారు.

➡️