Pan card – విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు..!

Mar 30,2024 12:46 #Crores, #Pan card, #student, #tax notices

మధ్యప్రదేశ్‌ : ఓ కాలేజీ విద్యార్థికి జిఎస్‌టి అధికారుల నుండి రూ.46 కోట్ల లావాదేవీలపై పన్ను కట్టాలంటూ … నోటీసులచ్చాయి. అంతే హడలెత్తిపోయిన ఆ విద్యార్థి లబోదిబోమంటూ శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు…!

గ్వాలియర్‌కు చెందిన ప్రమోద్‌ కుమార్‌ దండోటియా స్థానిక కళాశాలలో చదువుకుంటున్నాడు. ఇటీవల అతడికి ఐటీ, జీఎస్‌టీ నుంచి పన్ను నోటీసులు వచ్చాయి. అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయని, అందుకుగానూ పన్ను చెల్లించాలనేది వాటి సారాంశం. దీంతో ఆ విద్యార్థి సంబంధిత అధికారులను సంప్రదించగా తన పాన్‌ కార్డుపై ఓ కంపెనీ రిజిస్టర్‌ అయినట్లు తెలిసింది. ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో 2021లో ఆ విద్యార్థి పాన్‌కార్డ్‌ నెంబర్‌తో ఎవరో ఒక కంపెనీ ప్రారంభించి, అతడి బ్యాంకు అకౌంట్‌ నుంచి కోట్లలో లావాదేవీలు జరిపారని తెలుసుకున్న విద్యార్థి … వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ కంపెనీ గురించి తనకు తెలియదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ”ఆ విద్యార్థి పాన్‌ కార్డును గుర్తుతెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి కంపెనీని రిజిస్టర్‌ చేశారు. ఆ తర్వాతే అతడి బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది” అని పోలీసులు వెల్లడించారు.

ప్రమోద్‌ కుమార్‌ మాట్లాడుతూ … ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఆ తర్వాత చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు. శుక్రవారం మరోసారి అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశానన్నారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిందని, మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ తెలిపారు.

➡️