రఫాను వీడుతున్న పాలస్తీనియన్లు

Feb 16,2024 08:14 #Palestine
Palestinians leaving Rafah

గాజా : ఇజ్రాయిల్‌ బలగాలు వైమానిక, భూతల దాడులను పెంచడంతో గతంలో ‘సురక్షిత నగరం’గా పరిగణించిన దక్షిణ నగరం రఫా నుండి కూడా పాలస్తీనియన్లు తరలివెళుతున్నారు. దాడులు ఉధృతమైన నేపథ్యంలోనే ప్రాణ భయంతో రఫా నుండి పారిపోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఖాన్‌ యూనిస్‌లోని నాసర్‌ ఆస్పత్రిలో చిక్కుకుపోయిన వారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. సోమవారం రాత్రి ఆస్పత్రిని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించిన కొద్దిసేపటికే ఇజ్రాయిల్‌ దళాలు స్నిపర్‌ (పొంచి వుండి జరిపే) దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 67 మంది మరణించినట్లు పాలస్తీనియన్‌ వైద్య అధికారులు తెలిపారు. ఆ సమయంలో డజన్లసంఖ్యలో ప్రజలు ఆసత్రిలో చిక్కుకుపోయారని తెలిపారు. అనంతరం 14 నివాసాలు, మూడు మసీదులపై కూడా సైన్యం దాడులు జరిపింది. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడుల్లో 28,576 మంది పాలస్తీనియన్లు మరణించగా, సుమారు 68,291 మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న వారిపై ఇజ్రాయిల్‌ దళాలు దాడికి దిగడాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా తీవ్రంగా ఖండించాయి. ఇకనైనా ఇజ్రాయిల్‌ తన మిత్రులు, అంతర్జాతీయ సమాజం ఇచ్చే సూచనలను పాటించాలని ఆయా దేశాల నేతలు పేర్కొన్నారు.

➡️