పాకిస్తాన్‌ 313ఆలౌట్‌-ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌

Jan 3,2024 22:10 #Sports

సిడ్నీ: ఆస్ట్రేలియాతో ప్రారంభమైన మూడో టెస్ట్‌లో పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌, అఘా సల్మాన్‌, అమీర్‌ జమాల్‌ అర్ధసెంచరీలతో రాణించడంతో పాక్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 313పరుగులకు ఆలౌటైంది. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ను శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ షఫీక్‌(0), ఆయుబ్‌(0) డకౌట్లయ్యారు. దీంతో పాక్‌ జట్టు 4పరుగులకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మసూద్‌(35), బాబర్‌ అజామ్‌(26) రాణించినా.. సౌద్‌ షకీల్‌(5) నిరాశపరిచాడు. దీంతో పాక్‌ జట్టు 47పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆ దశలో రిజ్వాన్‌(88), అఘా సల్మాన్‌(53) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్‌కు ఏకంగా 94పరుగులు జతచేశారు. చివర్లో జమాల్‌(82) ఒంటరిపోరాటం చేశాడు. ఈ టెస్ట్‌తో ఆల్‌రౌండర్‌ జమాల్‌ టెస్టుల్లో అరంగేట్రం చేయగా.. ఆసీస్‌ సీనియర్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు ఇదే చివరి టెస్ట్‌. ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌కు ఐదు, స్టార్క్‌కు రెండు, హేజిల్‌వుడ్‌, లియాన్‌, మిఛెల్‌ మార్ష్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 6పరుగులు చేసింది. వార్నర్‌(6), ఖవాజా(0) క్రీజ్‌లో ఉన్నారు. మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్‌ 2-0తో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

➡️