పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ జకా అష్రఫ్‌ రాజీనామా

పాకిస్థాన్‌ : పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ జకా అష్రఫ్‌ తన పదవికి రాజీనామా చేశారు. పదవి చేపట్టి ఏడాది కాకముందే పిసిబి మేనేజ్‌ మెంట్‌ కమిటీ నుంచి అష్రఫ్‌ తప్పుకున్నారు. పాక్‌ జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. బోర్డుఅధ్యక్షుడిగా అష్రఫ్‌ పనితీరుపై కొందరు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

నాకు సాధ్యం కాలేదు : అష్రఫ్‌

‘పాక్‌ క్రికెట్‌ను వృద్ధిలోకి తెద్దామనుకున్నా. కానీ, ఆ విధంగా పని చేయడం నాకు సాధ్యం కాలేదు. నా స్థానంలో ఎవరిని నామినేట్‌ చేయాలనేది ప్రధాన మంత్రి అన్వర్‌ ఉల్‌ హక్‌ కకార్‌ నిర్ణయం తీసుకుంటారు’ అని అష్రఫ్‌ తెలిపారు.

రెండేళ్ల కాలంలోనే మారిన అధ్యక్షులు …

గడిచిన రెండేండ్ల కాలంలోనే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు ముగ్గురు అధ్యక్షులు మారారు. రమిజ్‌ రజా తర్వాత నజం సేథీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే.. ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ పదవీ కాలం ముగిశాక కొత్తగా ఎన్నికైన ప్రధాని అష్రఫ్‌ను నామినేట్‌ చేశారు. 2023 జూలైలో అతడి ఆధ్వర్యంలో పీసీబీ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఏర్పడింది.

కెప్టెన్లు మారినా పాక్‌ జట్టు పరిస్థితి మారలేదు…

అష్రఫ్‌ పీసీబీ హెడ్‌గా ఉన్న కాలంలో పాకిస్థాన్‌ జట్టు రెండు ఐసిసి టోర్నీల్లో ఆడింది. ఆసియా కప్‌తో పాటు వన్డే వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌కు చేరలేకపోయింది. దాంతో, పాక్‌ జట్టు ఎంపికపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ కప్‌లో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బాబర్‌ ఆజం కెప్టెన్‌గా తన పదవి నుండి వైదొలిగారు. ఆ తరువాత …. షాన్‌ మసూద్‌కు టెస్టు, వన్డే పగ్గాలు దక్కాయి. స్పీడ్‌స్టర్‌ షాహీన్‌ ఆఫ్రిదికి టీ20 సారథ్యం అప్పగించింది. కెప్టెన్లు మారినా కూడా పాక్‌ జట్టు స్థితి మారలేదు. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌ కావడమే కాకుండా.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను పోగొట్టుకుంది.

➡️