Pakistan : తోషఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌ దంపతులకు ఊరట

  •  14 ఏళ్ల జైలు శిక్ష సస్పెన్షన్‌

ఇస్లామాబాద్‌ : తోషఖానా అవినీతి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన భార్య బుష్రా బీబీకి విధించిన 14ఏళ్ల జైలు శిక్షను పాకిస్తానీ హైకోర్టు సోమవారం సస్పెండ్‌ చేసింది. పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికలు కొద్ది రోజులు ముందుగా జనవరి 31న ఇస్లామాబాద్‌ అకౌంటబిలిటీ కోర్టు వారిద్దరికీ శిక్ష విధించింది. ప్రభుత్వానికి వచ్చిన బహుమతులను అక్రమంగా అమ్ముకున్నారన్న కేసులో వారికి శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా శిక్షను నిలుపుచేసినప్పటికీ ఖాన్‌ జైల్లోనే వుండాల్సి వుంటుంది. ఎందుకంటే సైన్యం ఇమ్రాన్‌ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ, పలు తప్పుడు కేసుల్లో ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తోంది. ఒక కేసులో విముక్తి లభించినా, ఇంకా అనేక కేసులు ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కారణంగానే ఆయనను పదేళ్ళపాటు ఎన్నికల్లో పోటీచేయడానికి వీలులేకుండా అనర్హత వేటు వేశారు.

తోషాఖాన నియమాల ప్రకారం.. ప్రభుత్వ అధికారులు వారి బహుమతులను ధర చెల్లించి తీసుకోవచ్చు. కానీ ముందుగా బహుమతిని ట్రెజర్‌ హౌస్‌లో డిపాజిట్‌ చేయాల్సి వుంది. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన భార్య తమ అధికారాన్ని వినియోగించి తక్కువ ధరకు బహుమతులను సొంతం చేసుకున్నట్లు వారిపై అవినీతి కేసు నమోదైంది.

➡️