చిరంజీవికి పద్మవిభూషణ్‌

  • ప్రజావ్యవహారాల్లో వెంకయ్యనాయుడుకు
  • హరికథా కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ

న్యూఢిల్లీ : ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ అవార్డు దక్కింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వం 2024వ సంవత్సరానికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17మందికి పద్మభూషణ్‌; 110 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుండి కళారంగంలో విస్తృత సేవలు అందించినందుకు ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవిని ఎంపికచేసినట్లు పేర్కొన్నారు. దీంతో తెలుగు సినీ రంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవికి పలువురు అభినందనలు తెలిపారు. రాష్ట్రానికే చెందిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు కూడా పద్మవిభూషణ్‌ దక్కింది. ప్రజా వ్యవహారాల్లో విశేష కృషి చేసినందుకు ఈ అవార్డును ప్రకటించారు. మొత్తం ఐదుగురికి పద్మవిభూషణ్‌ ప్రకటించగా, వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. వీరుకాకుండా, తమిళ నాడుకు చెందిన ప్రముఖ నటీమణి బి.వైజయంతి మాల, పద్మ సుబ్రమణ్యం (కళారంగం), సోషల్‌వర్క్‌ విభాగంలో బీహార్‌కు చెందిన సులబ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌పాఠక్‌ (మరణానంతరం)కు పద్మవిభూషణ్‌ ప్రకటించారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన హరికథా కళాకారిణి డి.ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డు దక్కింది. దేశంలోనే ఏకైక సంస్కృత కథా కళాకారిణిగా ఆమె ప్రసిద్ధి చెందారు. భారతదేశంతో పాటు వివిధ దేశాల్లోనూ ఆమె హరికథా ప్రదర్శనలిచ్చారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సంగీత నాటక అకావడమీ అవార్డును బహుకరించింది. ఆమె తండ్రి దాలిపర్తి లాలాజీరావు వేములవాడ దేవస్థానంలో నాదస్వర విద్వాంసులు, తల్లి సరోజని గాయని. తెలంగాణ నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణా వాయిద్యకారుడు దాసరి కొండప్ప, ఆ రాష్ట్రానికే చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయకు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. భారతదేశపు మొట్టమొదటి మహిళా మావటి పార్వతి బారువా (అస్సోం), గుజరాత్‌ గిరిజనుల్లో సికిల్‌సెల్‌ ఎనీమియా నివారణకు జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్‌ యజ్వీ మాణెక్‌షా ఇటాలియా, గిరిజనుల అభివృద్ధికోసం ఛత్తీస్‌గడ్‌లో కృషి చేసిన జగేశ్వర ్‌యాదవ్‌, కళల విభాగంలో బీహార్‌కు చెందిన భార్యాభర్తలు శాంతిదేవి, శివన్‌పాశ్వన్‌, త్రిపురకు చెందిన చక్మారేఖ తదితరులకు పద్మశ్రీ దక్కింది. క్రీడలలో మహారాష్ట్రకు చెందిన ఉదరు విశ్వనాద్‌ దేశపాండేకు పద్మశ్రీ ప్రకటించారు. మిథున్‌చక్రవర్తి, ఉషాఉతప్‌లకు కళా రంగంలో పద్మభూషణ్‌ దక్కింది.

➡️