పద్మశ్రీ అవార్డు వాపస్‌

  • రెజ్లింగ్‌ చీఫ్‌ ఎన్నికకు నిరసనగా బజరంగ్‌ పునియా

న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నూతన అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ సన్నిహితుడైన సంజరు సింగ్‌ ఎన్నికపై నిరసనల పరంపర కొనసాగుతోంది. సంజరు సింగ్‌ ఎన్నికకు నిరసనగా రెజ్లింగ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రముఖ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ గురువారం ప్రకటించగా, తాజాగా మరో ప్రఖ్యాత రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా తనకు కేంద్రం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. సంజరు ఎన్నికకు నిరసన తెలుపుతూ ఒక లేఖను ప్రధానమంత్రి మోడీకి స్వయంగా అందజేసేందుకు పార్లమెంట్‌కు వెళుతున్న బజరంగ్‌ పూనియాను కర్తవ్యపథ్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తాను ఎలాంటి నిరసనలు చేయడం లేదని, ఈ లేఖను ప్రధానమంత్రిని అందచేయడానికి మాత్రమే వెళుతున్నాని పునియా ఎంతగా బతిమిలాడినా పోలీసులు వినిపించుకోలేదు. అనుమతి ఇవ్వలేదు. దీంతో మోడీకి రాసిన ఆ లేఖను పునియా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

”ప్రియమైన ప్రధాని గారూ, మీ ఆరోగ్యం క్షేమంగా ఉందని ఆశిస్తున్నాను. మీరు పనిలో బిజీగా ఉంటారు. అయినా కానీ దేశంలోని మల్లయోధుల వైపు మీ దృష్టిని మళ్లించడానికి నేను ఈ లేఖను రాస్తున్నాను’ అని లేఖలో పునియా పేర్కొన్నారు. ‘బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఈ ఏడాది జనవరిలో దేశంలోని మహిళా రెజ్లర్లు నిరసనను ప్రారంభించారని మీకు తెలిసే ఉంటుంది. నేను కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నాను. ప్రభుత్వం గట్టి చర్యకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించాం. అయితే మూడు నెలల తర్వాత కూడా బ్రిజ్‌ భూషణ్‌పై ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ లేదు. ఏప్రిల్‌లో మేము మళ్లీ వీధుల్లోకి వచ్చాము, తద్వారా అప్పుడు పోలీసులు అతనిపై కనీసం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు’ అని లేఖలో పునియా గుర్తు చేశారు. ‘జనవరిలో 19 మంది బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. అయితే ఏప్రిల్‌ నాటికి ఈ సంఖ్య 7కి తగ్గింది. అంటే బ్రిజ్‌ భూషణ్‌ 12 మంది మహిళా రెజ్లర్లపై తన ప్రభావాన్ని చూపారు’ అని పునియా తెలిపారు.’న్యాయం కోసం మా పతకాలను గంగా నదిలో కలిపేద్దామనుకున్నాం. అప్పుడు కూడా అతడిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది’ అని బజ్‌రంగ్‌ తన లేఖలో వెల్లడించారు.’కానీ, తాజా డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల ఫలితాలతో రెజ్లింగ్‌ సమాఖ్య మళ్లీ బ్రిజ్‌భూషణ్‌ చేతుల్లోకే వెళ్లినట్లయ్యింది. ఈ ఫలితాలను భరించలేక సాక్షి మాలిక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించింది. ఇప్పుడు మేం న్యాయం కోసం ఎక్కడికెళ్లాలో అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం మాకు ఎంతో చేసింది. 2019లో నాకు పద్మశ్రీ దక్కింది. అర్జున, ఖేల్‌రత్న వంటి అవార్డులు కూడా వచ్చాయి. కానీ, ఈ రోజు మహిళా రెజ్లర్లు తమకు భద్రత లేని కారణంగా ఆటకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఇది నన్ను ఎంతగానో కుంగదీసింది. అందుకే నా పద్మశ్రీని మీకే (ప్రధాని మోడీ) తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నా’ అని పునియా తన లేఖలో వెల్లడించారు.రాష్ట్రపతి, ప్రధాని సమాధానం చెప్పాలి: విజేందర్‌ సింగ్‌ సంజరు సింగ్‌ ఎన్నికకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ మద్దతుగా పలికారు. దీనిపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ”ఒక క్రీడాకారుడిగా ఆమె (సాక్షి మాలిక్‌) బాధను నేను అర్థం చేసుకోగలను. రెజ్లింగ్‌లో ఒలింపిక్‌ పతకం సాధించిన ఏకైక క్రీడాకారిణి ఆమె. నేడు న్యాయం కోసం పోరాటం చేస్తున్నా కానీ, ఆమెకు న్యాయం జరగడం లేదు. దీంతో ఆవేదనకు గురైన ఆమె ఆటకు వీడ్కోలు పలికింది. తాజా పరిణామాలతో క్రీడారంగం మొత్తం అసంతృప్తికి గురైంది. ఇలాంటివి జరిగిన తర్వాత ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెలను మైదానాలకు పంపిస్తారా? ‘ఒలింపిక్‌ పతక విజేతకే న్యాయం జరగలేదంటే.. మాకు ఎలా న్యాయం జరుగుతుంద’ని కుమార్తెల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు’ అని విజేందర్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిణామాలతో ప్రజాస్వామ్య, న్యాయ వ్యవస్థలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని.. దీనికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి సమాధానం చెప్పాలని కోరారు.

➡️