జనవరి 1న నింగిలోకి పిఎస్‌ఎల్వి సి-58

Dec 30,2023 15:42 #ISRO, #pslv

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : అంతరిక్ష పరిశోధనలో అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న ఇస్రో 2024 జనవరి 1న మరో కీలక ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమయింది. శ్రీహరికోటలోని ఫస్ట్‌ లాంచ్‌ ప్యాడ్‌ నుంచి పిఎస్‌ఎల్‌వి-సి 58 రాకెట్‌ ప్రయోగిస్తున్నారు. దీని ద్వారా 480 కిలోల బరువు ఉన్న ఎక్స్‌పో శాట్‌ను, కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఒక కేజీ బరువున్న వీఐవై శాటును కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది వరసగా ఎనిమిది రాకెట్ల ప్రయోగాలు శ్రీహరికోట నుంచి శాస్త్రవేత్తలు విజయవంతంగా చేపట్టారు.

2024 కూడా సక్సెస్‌తో ఈ రాకెట్‌ను గురి తప్పకుండా విడిచి పెట్టాలని ఆశిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇస్రో సందర్శకులను ఆహ్వానించింది. ఆన్లైన్‌ ద్వారా షార్‌లోని విజిటర్స్‌ గ్యాలరీ నుంచి వీక్షకులను దరఖాస్తులు ఆహ్వానించింది. ఇదిలా ఉంటే ఐదేళ్ల జీవితకాలం కలిగిన ఎక్స్‌ పో శాటిలైట్‌ ఒక విభిన్నమైనది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్స్‌ కిరణాల ధ్రువనాన్ని అధ్యయనం చేయడం కోసం దీన్ని రూపొందించింది. బెంగళూరులోని యు.ఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్లో తయారుచేసిన ఈ ఉపగ్రహాన్ని ఇప్పటికే శ్రీహరికోటకు తీసుకొచ్చి రాకెట్‌లో అనుసంధానం పనులు చేపట్టారు. భూమికి 650 కిలోమీటర్ల తక్కువ దూరంలో పిఎస్‌ఎల్వి -సి 58 రాకెట్‌ ఈ ఉపగ్రహాన్ని విడిచి పెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. టెలిస్కోప్‌లాగా పని చేసే ఈ ఉపగ్రహ సేవలో మన దేశానికి ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పిఎస్‌ఎల్వి -సి 58 రాకెట్‌ ప్రయోగం తర్వాత ఆ వెంటనే జి ఎస్‌ ఎల్‌ వి మార్కు- 2 ప్రయోగాన్ని కూడా ఇస్రో చేపట్టనుంది.

➡️