అపరిష్కృతంగానే విభజన సమస్యలు 

Feb 8,2024 08:34 #ap budget, #PDF MLCs
pdf mlcs on ap budget
  • బడ్జెట్‌లో అభివృద్ధికి ప్రాధాన్యత లేదు: పిడిఎఫ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బడ్జెట్‌లోని ‘కేంద్ర, రాష్ట్ర సంబంధాలు-విభజన సమస్యలు’ అనే అంశంలో విభజన సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని ప్రభుత్వం పేర్కొనడం దారుణం అని పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. శాసనమండలిలో పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై మరో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ఎపి విభజన హామీలు, చట్టాలకు సంబంధించి ప్రధాన అంశాలు ఇంత వరకు పరిష్కారం అవ్వలేదన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం ఓడరేవు, విశాఖ రైల్వేజోన్‌ తదితర ప్రధాన సమస్యలు పరిష్కారం అవ్వలేదని తెలిపారు. ఇవన్నీ పరిష్కరం అవ్వకుండా కేంద్ర, రాష్ట్ర సంబంధాలన్నీ సజావుగా ఉన్నాయని, విభజన సమస్యలన్నీ పరిష్కరించబడుతున్నాయని చెప్పడంలో అర్థం లేదన్నారు. బడ్జెట్‌లో ఐదేళ్లుగా డిబిటి ద్వారా రూ.4 లక్షల 21 వేల కోట్లు ప్రజలకు బదిలీ చేశామని మాత్రమే ప్రముఖంగా చెప్పారని, అభివృద్ధికి సంబంధించిన అంశాలు లేవన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత లేదన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు సబ్‌ప్లాన్‌ను ఈ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందన్నారు. డిబిటి పథకాలనే ఎస్‌సి, ఎస్‌టి, బిసి సబ్‌ప్లాన్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మార్చేసిందన్నారు. 56 బిసి కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశామని బడ్జెట్‌లో చెప్పిందని, వాటి ద్వారా ఖర్చు చేయడానికి నిధులు ఎంత కేటాయించింది చెప్పలేదని అన్నారు. రహదారుల అభివృద్ధికి రూ.2,626 కోట్లు ఖర్చు చేశామని చెప్పడం సత్యదూరమన్నారు. రాష్ట్రంలో ప్రధాన రహదారుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చూస్తున్నామన్నారు. పాలనా వికేంద్రీకరణ స్థానిక సంస్థలను ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, సర్పంచులకు ఎటువంటి అధికారాలూ లేకుండా చేసిందన్నారు. ఉద్యోగులకు 11వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేశామని, ఆశాలు, అంగన్‌వాడీలకు వేతనాలు పెంచామని చెప్పడం సత్యదూరంగా ఉందన్నారు. ఐదేళ్లకాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించి 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత వెనకడుగు పడిందన్నారు.

➡️