తల్లిదండ్రుల స్ఫూర్తితో ఆరోగ్య వైద్య శిబిరాలు ఏర్పాటు : బాలకృష్ణ

Mar 3,2024 18:05 #Balakrishna, #Free medical camp

ప్రజాశక్తి-హిందూపురం( శ్రీ సత్యసాయి జిల్లా) : తన తల్లి స్వర్గీయ బసవతారక, తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో హిందూపురం పట్టణంలోని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వగృహం ఆవరణంలో రెండు రోజులు పాటు ఏర్పాటుచేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ మొబైల్ వాహన వైద్య శిబిరానికి ఆదివారం ఎమ్మెల్యే హాజరైనారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేకు పూల బొకాయిలు అందించి స్వాగతం పలికారు. మొబైల్ వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించారు, ఎంతమంది వైద్య శిబిరానికి హాజరైనారు, ఎలాంటి జబ్బులకు వస్తున్నారని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు, వైద్య శిబిరానికి వచ్చిన రోగులను పలకరించి ఆరోగ్యం పట్ల భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ తన తల్లి బసవ తారక క్యాన్సర్ వ్యాధితో మరణించడం జరిగిందని, ఆమె మరణం తమ కుటుంబానికి ఎంతో బాధ పెట్టిందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె తోపాటు సమాజమే దేవాలయంగా భావించే తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థంగా హైదరాబాదులో బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించడం జరిగిందన్నారు. డబ్బు లేని నిరుపేదలకు సహాయం, డబ్బున్న ధనికులకు స్ఫూర్తి దాయకంగా ఉండాలన్న ఉద్దేశంతో క్యాన్సర్ ఆసుపత్రి నెలకొల్పి వేలాదిమందికి శస్త్ర చికిత్సల నిర్వహించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఇదే విధంగా మొబైల్ వాహన వైద్య శిబిరం ద్వారా క్యాన్సర్ తో పాటు వివిధ రకాల జబ్బులకు వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి ప్రముఖ వైద్యులను ఏర్పాటు చేయడం జరిగిందని. మొట్ట మొదటి హిందూపురం నుండే మొబైల్ వైద్య శిబిరాలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదేవిధంగా హిందూపురం నియోజకవర్గం లో గత సంవత్సరం నుండి ఎన్టీఆర్ మొబైల్ చైతన్య రథం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తున్నామన్నారు. దాతల సహాయ సహకారాలతో బసవతారక ఇండోర్ అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహిస్తున్నామని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు.

➡️