సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడం .. కమ్యూనిస్టుల ప్రథమ కర్తవ్యం

భారత కమ్యూనిస్ట్‌ పార్టీ 103వ వార్షికోత్సవం సందర్భంగా ప్రమోద్‌ దాస్‌ గుప్తా మెమోరియల్‌ ట్రస్ట్‌, కలకత్తా వారు సెమినార్‌ నిర్వహించారు. అక్కడ ‘వర్తమాన కాలంలో 175 ఏళ్ల కమ్యూనిస్ట్‌ ప్రణాళిక’ అనే అంశంపై గత నెల17న సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్‌ కరత్‌ చేసిన ప్రసంగ పాఠమిది.

తాష్కెంట్‌లో ఏర్పడిన భారత కమ్యూనిస్ట్‌ పార్టీ వార్షికోత్సవంతో పాటు…మార్క్స్‌, ఎంగెల్స్‌ రచించిన ‘కమ్యూనిస్ట్‌ ప్రణాళిక’ ప్రచురణ 175వ వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు…మనమిక్కడ సమావేశమయ్యాం. ఈ రెండిటికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ‘కమ్యూనిస్ట్‌ ప్రణాళిక’ అనేది కమ్యూనిస్టుల మొదటి రాజకీయ ప్రకటన. కమ్యూనిస్ట్‌ ఉద్యమానికి సంబంధించిన ప్రతీది, ఈ చిన్న రచన ఆధారంగానే జరుగుతుంది. జర్మనీ కార్మికులకు చెందిన ‘కమ్యూనిస్ట్‌ లీగ్‌’ అనే చిన్న బృందం కోసం వారు దానిని 1848లో రచించారు. తరువాత ఇతర కార్మికుల్ని కలుపుకునేందుకు దానిని విస్తరించి, ఆ తరువాత ఇంటర్నేషనల్‌ వర్కింగ్‌ మెన్స్‌ అసోసియేషన్‌ (మొదటి ఇంటర్నేషనల్‌)గా అభివృద్ధి చేశారు. కాబట్టి కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో లేకుండా ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీల ఏర్పాటు గురించి ఆలోచించలేం.
1920లో నూతన విప్లవకర రష్యాలో భాగమైన తాష్కెంట్‌లో కమ్యూనిస్ట్‌ ఇంటర్నేషనల్‌ రెండో మహాసభకు ఎం.ఎన్‌.రారు ప్రతినిధిగా హాజరయ్యాడు. తాష్కెంట్‌ చేరుకున్న భారత సంతతికి చెందిన కొందరిని, భారతదేశాన్ని విడిచిపెట్టిన వలసదారులను, రష్యా నుండి శిక్షణ, మద్దతు పొంది, తిరిగొచ్చి భారతదేశాన్ని విముక్తి చేసేందుకు సిద్ధమైన ముహాజిర్లను కూడగట్టేందుకు రారు చొరవ చూపాడు. అలా కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో, అంతర్జాతీయ కార్మికవర్గ ఉద్యమానికి పునాదులు వేసింది. చిన్న పార్టీగా ఏర్పడిన భారత కమ్యూనిస్ట్‌ పార్టీని భారతదేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదంపై పోరాటం చేయాలనుకున్న ప్రజలు ప్రోత్సహించారు. పెట్టుబడిదారీ విధానం అంతర్జాతీయవ్యవస్థ అనే అవగాహన కోసం కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో పునాదులను వేసింది. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారీ విధానంపై పోరాటం చేసేందుకు కార్మికవర్గం కూడా అంతర్జాతీయ ఉద్యమాన్ని నిర్మించాల్సి ఉంటుంది. కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టోలో చారిత్రక భౌతికవాద రూపురేఖలు, చారిత్రక భౌతికవాద భావనలను స్పష్టంగా పేర్కొన్నారు. ‘ఇప్పటివరకూ నడిచిన చరిత్రంతా వర్గ పోరాటాల చరిత్రే’ అని ‘కమ్యూనిస్ట్‌ ప్రణాళిక’లో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. పెట్టుబడిదారీ విధానం, బూర్జువావర్గం, కార్మిక వర్గాన్ని, మిగులు విలువను ఎలా దోచుకుంటుందన్న విషయాన్ని కూడా ప్రణాళిక వివరిస్తుంది. ప్రపంచ పెట్టుబడిదారీ విధానం ఎలా రూపుదిద్దుకుంటుందో కూడా మ్యానిఫెస్టో స్పష్టంగానే ఊహించింది. వాస్తవానికి మార్క్స్‌, పెట్టుబడిదారీ ప్రపంచీకరణకు ప్రవక్త అని బూర్జువా వర్గాలు కూడా అంగీకరిస్తాయి. కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో దాని భవిష్యత్‌ గూర్చి ఇలా చెప్తుంది : దాని ఉత్పత్తులకు నిరంతరం విస్తరిస్తున్న మార్కెట్లు అవసరం, దాని ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా బూర్జువా వర్గాన్ని తరుముతాయి. అది ప్రతీ చోట గూడు ఏర్పాటు చేసుకొని, ప్రతి చోట స్థిరపడి, సంబంధాలను ఏర్పరచుకోవాలి. కాబట్టి బూర్జువావర్గం, ఉత్పత్తుల కోసం మార్కెట్ల వెంటపడి, ప్రపంచ నలుమూలల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనిని మార్క్స్‌ ముందే ఊహించాడు. కానీ మ్యానిఫెస్టో…పెట్టుబడిదారీ విధానం ఒక వ్యవస్థ అనే పూర్తి స్థాయి విశ్లేషణ ఇవ్వలేదు. తర్వాత మార్క్స్‌, 1867లో రాసిన క్యాపిటల్‌ (పెట్టుబడి) గ్రంథంలో దానిని విశ్లేషించాడు.
మార్క్స్‌ పెట్టుబడిదారీ సిద్ధాంతాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిన లెనిన్‌, ‘పెట్టుబడి’ గ్రంథంలో మార్క్స్‌ చేసిన కృషిని ఉపయోగించాడు. ఇప్పుడు గుత్తపెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందింది. దీనిని సామ్రాజ్యవాదంగా గుర్తించాలి. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం అత్యున్నత దశ అని ఆయన అన్నాడు. ఆ విధంగా మార్క్స్‌ తరువాత, ఆయన సిద్ధాంతాన్ని ఉన్నత దశకు తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు పెట్టుబడి దారీ విధానం, సామ్రాజ్యవాదం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచవ్యాప్త వ్యవస్థ అని లెనిన్‌ గ్రహించాడు. సామ్రాజ్యవాదం, ప్రపంచంలో వివిధ దేశాలను వలస రాజ్యాలుగా మార్చి, వాటిని పెట్టుబడి దారీ సంబంధాల్లోకి లాగింది. కాబట్టి, మనం సామ్రాజ్య వాదంపై పోరాటం చేయాలంటే ఆ పోరాటం అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, దానిని అశేష ప్రజానీకం ముఖ్యంగా సామ్రాజ్య వాదం, ప్రపంచవ్యాప్త పెట్టుబడి చేతిలో దోపిడీకి గురవుతున్న రైతాంగం ఉన్న చిన్నచిన్న వలసలలో కూడా ఉధృతం చేయాలని లెనిన్‌ అన్నాడు. అందువల్ల, అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గం చేస్తున్న పోరాటాలకు, విముక్తి కోసం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే వలస దేశాల రైతులకు మధ్య సంబంధం ఉంటుంది.
సామ్రాజ్యవాద శక్తులు మరో వినాశనకర యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికా తన పశ్చిమ మిత్రదేశాల అండతో గాజాపై భూదండయాత్రను చేసేందుకు ఇజ్రాయిల్‌ సిద్ధంగా ఉంది. సామ్రాజ్యవాదం కింద వలసవాద ప్రక్రియ 20వ శతాబ్దంలోనే దాదాపు పూర్తయింది. కానీ పాత రకానికి చెందిన ఒక స్థిర నివాసుల వలస మిగిలింది, అదే పాలస్తీనా. పాలస్తీనాను ఆక్రమించి, పాలస్తీనియన్లను వలస ప్రజలుగా మార్చింది ఇజ్రాయిల్‌. ఇజ్రాయిల్‌ సామ్రాజ్యవాద దేశం కాదని ఎవరైనా వాదించవచ్చు. సాంప్రదాయ నిర్వచనం ప్రకారం అది అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ లాంటి సామ్రాజ్యవాద దేశం కాదు. కానీ, శత్రువు కదలికలను కనిపెట్టే ఒక చిన్న మిలిటరీ శిబిరం. అది సామ్రాజ్య వాదానికి పుట్టిన బిడ్డ.
ఇజ్రాయిల్‌, పాలస్తీనాల చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోకుంటే, వాటి వివాదానికి సంబంధించి నేడు జరుగుతున్నదే మిటో సమగ్రంగా అర్థం చేసుకోలేం. పెట్టుబడిదారీ విధానంపై మార్క్స్‌ విశ్లేషణ నుండి లెనిన్‌ సామ్రాజ్యవాద సిద్ధాంతం వరకున్న వివరణ, సామ్రాజ్యవాదం సజీవంగానే ఉందనీ, ప్రపంచంలో నేడు అది ప్రభావం చూపుతుందనే అవగాహననిస్తుంది. గాజాలో మనం చూస్తున్నది, చూడబోతున్నది కూడా సామ్రాజ్యవాదం ప్రారంభించిన మరో వినాశనకర యుద్ధం. సామ్రాజ్యవాదం, ఇరాక్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభించి, ఇరాక్‌ను నాశనం చేసింది. లిబియాపై దాడి చేసి, లిబియాను నాశనం చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌పై యుద్ధం చేసి, దానిని మట్టి కరిపించింది. అలాగే బ్రిటీష్‌ వారు మధ్య ప్రాచ్యం అని పిలిచే పశ్చిమాసియాలో కూడా ఇదే జరుగుతున్నది.
ఇజ్రాయిల్‌, పాలస్తీనా వివాద చరిత్రను వివరించడానికి తిరిగి 1948కి వెళ్తాను. మే, 1948 వరకు ఇజ్రాయిల్‌ లేదు. 1948 వరకు బ్రిటీష్‌ పాలన కింద, దాని అధీన దేశంగా పాలస్తీనా మాత్రమే ఉంది. దానికంటే ముందు, 1917-19 మధ్యకాలంలో బ్రిటీష్‌ దళాలు పాలస్తీనాను ఆక్రమించే వరకు, పాలస్తీనా ఓట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగం. మొదటి ప్రపంచయుద్ధం సామ్రాజ్య విభజనతో ముగిసింది. పాశ్చాత్య శక్తులు, మధ్య ప్రాచ్యాన్ని వారి వారి దేశాలపై ప్రభావం చూపే ప్రాంతాలుగా విభజించాయి. అలా పాలస్తీనా బ్రిటీష్‌ ఆధీనంలోకి వెళ్లింది. యూరోప్‌లో యూదుల చరిత్ర తెలిసిందే. కేవలం యూదులనే కారణంగా క్రైస్తవ మతానికి, యూదు మతానికున్న చారిత్రక విరోధం కారణంగా అనేక ప్రాంతాల్లో యూదుల్ని పీడించి, అణిచి వేశారు. 19వ శతాబ్దం చివర్లో యూదు ప్రజలకు స్వంత దేశాన్ని స్థాపించే లక్ష్యంతో జియోనిస్ట్‌ ఉద్యమమనే రాజకీయ ఉద్యమం యూదుల్లో ప్రారంభమైంది. శతాబ్దాలుగా యూదులు యూరోప్‌లో నివసిస్తున్నారు. వారు మధ్య, తూర్పు యూరోపియన్‌ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు. చాలామంది యూరోపియన్‌ చక్రవర్తులు వారి విధేయతను క్యాథలిక్‌ చర్చికి ప్రకటించి, యూదుల్ని హింసించారు. యూదు ఉద్యమం చివరికి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి అనుకూలంగా మారింది. 1917లో యూరోప్‌లో మొదటి ప్రపంచయుద్ధం చెలరేగినపుడు, యూదు ప్రజలు బల్ఫోర్‌ డిక్లరేషన్‌ను స్వీకరించారు. అది బ్రిటీష్‌ విదేశాంగ కార్యదర్శి అర్థర్‌ బల్ఫోర్‌ జారీ చేసిన బహిరంగ ప్రకటన. అది, పాలస్తీనాలో యూదులు మాతభూమిని ఏర్పాటు చేసుకోడానికి బ్రిటీష్‌ వారి మద్ధతును వ్యక్తం చేసింది.
అప్పటి నుండి వరుస సంఘటనలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధంలో సంపూర్ణ వినాశనంగా పిలువబడే నాజీల ఊచకోత, యూదులపై మారణహోమం వంటివి జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపు అన్ని పాశ్చాత్య శక్తులు, సంపూర్ణ వినాశనంపై అపరాధ భావంతో, అవ మానంతో పాలస్తీనాలో మాతృ భూమి కోసం యూదుల జియోనిస్ట్‌ డిమాండ్‌ను అంగీక రించాయి. అసలైన పాలస్తీనియన్లు, అప్పటికే అక్క డ ఉంటున్న అరబ్బుల ప్రస్తావనే రాలేదు. ఈలోగా, దశా బ్దాలకు పైగా పాలస్తీనాలోకి యూదుల వలసలు కొనసాగుతున్నాయి. వారక్కడ స్థిరపడిపోవడం, అరబ్బులపైన దాడులు చేసి వారిని వెళ్ళగొట్టడం మొదలుపెట్టారు. చివరకు, 1947 నవంబర్‌ 29న కొత్తగా ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి 181వ తీర్మానాన్ని (విభజన తీర్మానం) ఆమోదించింది. యూదులకు ఇజ్రాయిల్‌ అనే ప్రత్యేక దేశాన్ని, అరబ్బులకు పాలస్తీనా అనే ప్రత్యేక దేశాన్ని ఇవ్వాలన్న పూర్వ బ్రిటీష్‌ ఆదేశం మే 1948 నాటికి ముగుస్తుంది కాబట్టి, ఈ తీర్మానం రెండు దేశాలుగా విభజన చేసింది.
కానీ ఇది అమలు కాలేదు. ఇజ్రాయిలీయులకు ఎక్కువ ఆయుధాలు వుండడం, పాశ్చాత్య దేశాల మద్దతుండడం వల్ల, నిజానికి ఇజ్రాయిల్‌ ప్రత్యేక దేశంగా ప్రకటించబడిన నాటి నుండి పాలస్తీనా అరబ్బులను వారి భూభాగం నుండి వెళ్ళగొట్టే ప్రక్రియ ప్రారంభం అయింది. అరబ్బులు సమిష్టిగా దీన్ని నక్బా (విపత్తు) అంటారు. ఈ సంవత్సరం నక్బా 75వ వార్షికోత్సవం. వెళ్లగొట్టిన తరువాత వారిప్పుడు అసలు పాలస్తీనాలో లేరు. కొందరు జోర్డాన్‌లోని వెస్ట్‌ బ్యాంక్‌కు వెళ్లారు. కొందరు గాజాలోకి వెళ్లారు. గాజా ఒక ప్పుడు ఓట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగం. తరువాత అది కొన్ని దశాబ్దాలుగా ఈజిప్ట్‌ అదుపులోకి వచ్చింది.
ఆక్రమిత భూభాగాలకు, గాజాకు అవతల ఎక్కువ మంది పాలస్తీనియన్లు ఉన్నారు. పాలస్తీనా శరణార్థులు 60 ఏళ్ళకు పైగా లెబనాన్‌ శిబిరాల్లో ఉంటున్నారు. గాజాలో మెజార్టీ పాలస్తీనియన్లు, ఇజ్రాయిల్‌గా మారిన ప్రాంతాల నుండి వెళ్లగొట్టబడిన శరణార్థుల వంశీకులే. గాజా లో టౌన్‌షిప్‌లుగా మారిన 8 శరణార్థ శిబిరాలు ఉన్నాయి. ఉత్తర గాజా నుండి 11లక్షల మంది ప్రజల్ని ఖాళీ చేయాలని ఇజ్రాయిల్‌ ఆజ్ఞాపించింది కాబట్టి, 75 ఏళ్ళ క్రితం తమ మాతృభూమిని వదిలేయాల్సొచ్చిన ఈ ప్రజలు, నేడు మరొక నక్బాను ఎదుర్కొంటున్నామని అంటున్నారు. దీని వెనకున్న కుట్రను గ్రహించడం కష్టమేమీ కాదు. ఈజిప్టు, గాజా మధ్య ఉన్న రాఫా సరిహద్దును తెరవాలనీ, ఒకప్పుడు లెబనాన్‌, జోర్డాన్లకు వెళ్ళిన విధంగా, స్థానచలనం కలిగిన పాలస్తీనియన్లను తీసుకోవాలని వారు ఈజిప్ట్‌కు చెప్తున్నారు. వారొక్కసారి అక్కడికి వెళితే, తిరిగి రానివ్వరు. దానివల్ల గాజా ఖాళీ అవుతుంది, కాబట్టి వారు దానిని స్వాధీనం చేసుకుంటారు.
నేడు ఇజ్రాయిలీలకు హమాస్‌ను అంతం చేయాలన్న లక్ష్యం ఉంది. ఈ ప్రక్రియలో ‘కొంత జాతి ప్రక్షాళన చేసి, పాలస్తీనియన్లను వదిలించుకుందాం’ అనే ఒక రహస్య ఎజెండా ఉంది. హమాస్‌ను నిర్మూలించడం చాలా కష్టం. హమాస్‌ గాజాలో బాగా వేళ్ళూనుకొని ఉంది. 2007లో పాలస్తీనా భూభాగాలలో జరిగిన ఎన్నికల్లో హమాస్‌ విజయం సాధించింది.
అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్లు, దిగ్బంధించబడిన గాజా స్ట్రిప్‌ నుండి తప్పించుకొని, అడ్డంకులను ఛేదించి, ఇజ్రాయిల్‌ సైనిక స్థావరాలపైన, యూదుల నివాసాల పైన దాడి చేయడంతో 1500 పైగా ప్రజలు మరణిం చారు. ఇప్పుడు దీనినే హమాస్‌ టెర్రరిస్టుల భయంకర దాడిగా, ఊచకోతగా చెప్తున్నారు. కాబట్టి ఇజ్రాయిల్‌, గాజాకు వ్యతిరేకంగా ప్రతీకార చర్య తీసుకుంటుంది.
అయితే గాజా ఏమిటి? ఇజ్రాయిల్‌ సైన్యం స్థిర నివా సాలను కూల్చి, 2005లో గాజా స్ట్రిప్‌ నుండి విరమించు కున్నట్లు చెప్తున్నారు. కానీ వాస్తవ ఆక్రమణకు బదులుగా, వారు దిగ్బంధనం విధించి, గాజాను సమర్ధవంతంగా అదుపు చేసారు. 365 చదరపు మీటర్లు లేదా 141 చదరపు మైళ్ల విస్తీర్ణంతో మధ్యధరా ప్రాంతం, ఇజ్రాయిల్‌, ఈజిప్ట్‌ మధ్య దాదాపు 23 లక్షల మంది ప్రజలు నివసిస్తున్న గాజా, ఓ ఇరుకైన తీర ప్రాంతం. గాజా స్ట్రిప్‌ లోకి అన్ని ప్రవేశ మార్గాల్ని ఇజ్రాయిల్‌ నియంత్రిస్తుంది. గాజా లోని 23 లక్షల మంది ప్రజలు తమకవ సరమైన ఆహారం, నీరు, విద్యుత్‌ కోసం ఇజ్రాయిల్‌పై ఆధార పడతారు. గాజా లోపల, వెలుపల ప్రయాణించే వారి సామర్థ్యం ఇజ్రాయిల్‌ అనుమతులపై ఆధారపడి ఉంది. అందుకే గాజా స్ట్రిప్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ‘బహిరంగ జైలు’గా పేర్కొంటారు. గడిచిన 16 సంవత్సరాలుగా, 2007 నుండి ఈ అక్రమ దిగ్బంధనం గాజా స్ట్రిప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ జైలు జీవితానికి వ్యతిరేకంగా ప్రజలు ఎప్పటికప్పుడు తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నారు. వారు ఇజ్రాయిల్‌ లోకి రాకెట్లను ప్రయోగిస్తూ, సైనికదళాల్ని పంపుతున్నారు. ప్రతీసారి నావికా, వైమానిక బాంబులతో గాజాలో వందల మంది సాధారణ ప్రజలను చంపడం ద్వారా ఇజ్రాయిల్‌ ప్రతీకారం తీర్చుకుంటుంది. ‘మీరు జైల్లో ఉన్నారు, మీ ప్రవర్తన సరిగా లేకుంటే, మీకు ఆహారం, విద్యుత్‌, మందుల సరఫరా ఉండదు. మీరు నిరసిస్తే, మీ పైన దాడి చేస్తాం’ ఇది, ఇజ్రాయిల్‌ వైఖరి.
పదహారేళ్ల నిరాశ తరువాత, హమాస్‌ ఆధ్వర్యంలో సమీకరించబడిన గాజా యువత, ఇజ్రాయిల్‌ ఊహించని విధం గా దాడి చేసింది. తమకు అధునాతన సైన్యం, శాటిలైట్‌ అందించే అధునాతన నిఘా వ్యవస్థ ఉందని వారనుకున్నారు. ఇవన్నీ ఉన్నా, వారిపై దాడి జరగడంతో, ఈ ప్రాంతాలపై వారి అదుపు లేకుండా పోయింది. ఇప్పుడు ఇజ్రాయిల్‌లో ఉన్నది మితవాద ప్రభుత్వం. నాజీల, ఫాసిస్టుల పాలనలో ఇబ్బందులు పడ్డ ప్రజలు, ఫాసిస్టుల వలె ప్రవర్తించే ప్రజలనే నాయకులుగా ఎంచుకోవడం వింతగా ఉంది. తమ పవిత్ర భూమిలో ఏ ఒక్క అరబ్బు నివసించ కూడదనే ఫాసిస్టులు, మత దురభిమానులు, తీవ్రవాదులతో బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వం నిండి పోయింది.
తీవ్రవాద యూదు ఉద్యమం, వెస్ట్‌ బ్యాంక్‌లో ఐదు లక్షల మంది యూదు స్థిర నివాసులను, ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతంలోకి స్థిరనివాసాల్లోకి చొప్పించింది. ఈ యూదు స్థిర నివాసులు జియోనిస్ట్‌లు. వారు భావజాల పరంగా ప్రేరేపించబడ్డారు, భారీగా ఆయుధాలున్నవారు, వారి పవిత్రభూమి పూర్తిగా వారి కిందే ఉంది కాబట్టి పాలస్తీనియన్లను తరిమి వేసే లక్ష్యంతో వారక్కడికి వచ్చారు. అందువల్ల పాలస్తీనాలో జీవనోపాధి వనరైన ఆలివ్‌ చెట్లను క్రమపద్ధతిలో నరికివేసారు. వారు పాలస్తీనియన్ల భూమిని, ఇళ్ళను ఆక్రమించి, అక్రమంగా ఉపయోగిస్తూ, వారిని వెళ్ళిపోవాలని ఒత్తిడి చేస్తారు. ఇజ్రాయిల్‌ భద్రతా సిబ్బంది లేదా సాయుధ స్థిరనివాసులు ఈ ఏడాదిలోనే వెస్ట్‌బ్యాంక్‌లో 47 మంది పిల్లలను, 248 మంది పాలస్తీనియన్లను చంపివేసారు.
కాబట్టి ఇక్కడ 20వ శతాబ్దపు పని అసంపూర్ణంగా మిగిలి ఉంది. ఇప్పటికీ విముక్తి చేయబడని వలస ఒకటి ఉంది. ఆధునిక కాలంలో సుదీర్ఘ కాలంపాటు ఆక్రమిత భూభాగం ఇది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇజ్రాయిల్‌ ఏర్పడినప్పుడు, అప్పటికే సోవియట్‌ యూనియన్‌, సోషలిస్టు కూటమి ఉంది. జాతీయ విముక్తి పోరాటాలు ముందుకు సాగుతున్నాయి. అరబ్‌ జాతీయోద్యమం అభివృద్ధి చెందింది. ఈజిప్ట్‌లో నాజర్‌ అధికారంలోకి వచ్చాడు. ఇరాక్‌లో కూడా ‘బాత్‌’ ఉద్యమం ఊపందుకుంది. వారంతా లౌకికవాదులుగా ఉన్నారు. కాబట్టి, తన ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రాంతంలో ఒక పోలీసు అవసరమని అమెరికా కోరుకుంది. ఫలితంగా ఒక అపవిత్ర ఒప్పందం కుదిరింది. అమెరికా ఇజ్రాయిల్‌కు అండగా ఉంటూ, ఆయుధాలతో సహా భౌతిక వనరులను సమకూర్చుతుంది. దీనికి ప్రతిఫలంగా, అరబ్బు ప్రగతిశీల జాతీయవాద లౌకిక శక్తులు పెరగకుండా ఇజ్రాయిల్‌ చూసుకునే ప్రక్రియ కొనసాగింది.
ఈ విరోధానికి అమెరికా ఎలా స్పందించిందో మనం చూడవచ్చు.

(ఇంకా వుంది)
ప్రకాష్‌ కరత్‌

➡️