కుర్రాళ్లకు సదవకాశం.. నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టి20

Jan 11,2024 11:54 #Sports
  • రాత్రి 7.00గం||లకు

మొహాలి: దక్షిణాఫ్రికా పర్యటనను దిగ్విజయంగా ముగించిన టీమిండియా స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో టి20 సిరీస్‌కు సిద్ధమైంది. ఐసిసి టి20 ప్రపంచకప్‌కు ముందు జరిగే ఆఖరి అంతర్జాతీయ సిరీస్‌ కూడా ఇదే కావడంతో యువ క్రికెటర్ల ప్రదర్శనపైనే బిసిసిఐ ప్రధానంగా దృష్టి సారించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు టి20ల సిరీస్‌లో భాగంగా గురువారం పంజాబ్‌లోని బింద్రా స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరగనుంది. దక్షిణాఫ్రికాతో వైట్‌బాల్‌ సిరీస్‌లకు దూరంగా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లితో ఈ సిరీస్‌లో బరిలో దిగనున్నారు. విరాట్‌ కోహ్లి వ్యక్తిగత కారణాల రీత్యా తొలి టి20కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బోర్డుకు తెలిపాడు. ఈ విషయాన్ని స్వయంగా భారత జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడే వెల్లడించాడు. పాత్రికేయులతో నిర్వహించిన ప్రీమ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ద్రావిడ్‌ ఈ విషయాన్ని చెప్పాడు. వ్యక్తిగత కారణాలతోనే కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమవుతున్నాడని, అయితే అతడు ఇండోర్‌తో ఈనెల 14న జరగబోయే రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపాడు. అఫ్గాన్‌తో సిరీస్‌కు రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడని, అతడికి తోడు యశస్వి జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ను ఓపెన్‌ చేస్తాడని తెలిపాడు. రైట్‌ హ్యాండ్‌, లెఫ్ట్‌ హ్యాండ్‌ కాంబినేషన్‌ వైపే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపినట్లు తెలిపాడు. దీంతో 2022 టి20 ప్రపంచకప్‌లో ఆడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ తర్వాత రోహిత్‌ టి20ల్లో బరిలోకి దిగనున్నాడు. రషీద్‌ఖాన్‌ దూరం..ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ భారత్‌తో జరిగే మూడు టి20ల సిరీస్‌కు దూరమయ్యాడు. వెన్నునొప్పికి ఆపరేషన్‌ చేయించుకున్న రషీద్‌ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని, అతడు ఈ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడని కెప్టెన్‌ ఇబ్రహీం జడ్రాన్‌ తెలిపాడు. అయితే సిరీస్‌ మొత్తానికి దూరమైనా రషీద్‌ మాత్రం జట్టుతో కలిసి భారత్‌కు వచ్చాడు. భారత పిచ్‌లపై అనుభవం ఉన్న రషీద్‌ లేకపోవడంతో ఆఫ్ఘన్‌ స్పిన్‌ దళాన్ని ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌ నడిపించనున్నారు. వన్డే ప్రపంచకప్‌ తర్వాత లోయర్‌ బ్యాక్‌ పెయిన్‌తో ఇబ్బందిపడ్డ రషీద్‌.. ఇటీవలే సర్జరీ చేయించుకున్నాడు.

జట్లు(అంచనా)..

భారత్‌: రోహిత్‌(కెప్టెన్‌), జైస్వాల్‌, శుభ్‌మన్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌, కుల్దీప్‌, బిష్ణోరు, ముఖేశ్‌ కుమార్‌.

ఆఫ్ఘనిస్తాన్‌: హజ్మతుల్లా గుర్బాజ్‌, జడ్రాన్‌(కెప్టెన్‌), నజీబుల్లా, నబి, ఒమర్జారు, ముజీబ్‌, షరాఫుద్దీన్‌, ఖ్విజ్‌ అహ్మద్‌, నూర్‌ అహ్మద్‌/నవీన్‌, ఫారూఖీ.

➡️