అవకాశవాదులకు ఓటు అడిగే హక్కు లేదు : సిపిఎం నాయకురాలు ఎస్‌ పుణ్యవతి

Nov 18,2023 11:32
  • వైరాలో ప్రచారం

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : అవకాశవాదులకు, పార్టీల ఫిరాయింపుదారులకు ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదని సిపిఎం నాయకురాలు ఎస్‌ పుణ్యవతి అన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల పరిధిలోని జన్నారం గ్రామంలో శుక్రవారం వైరా నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి భూక్య వీరభద్రంతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేగళ్ల తిరుమలరావు అధ్యక్షతన జరిగిన సభలో పుణ్యవతి మాట్లాడుతూ.. ఈ నెల 30న రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో అవకాశవాదులకు, ఫిరాయింపుదారులకు బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజల కోసం నిర్బంధాలు ఎదుర్కొని, జైలు శిక్షణ అనుభవించిన భూక్యా వీరభద్రంను గెలిపించాలని, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి చేశారని చెబుతున్న సిఎం కెసిఆర్‌.. గ్రామాల్లో పర్యటిస్తే ఏం అభివృద్ధి చేశారో తెలుస్తుందన్నారు. మరోవైపు గ్యారంటీ లేని పథకాల పేరుతో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని విమర్శించారు. విజ్ఞతతో ఆలోచించి, ప్రజలకు అందుబాటులో ఉంటున్న సిపిఎంను గెలిపించి.. బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం ఏన్కూర్‌, టిఎల్‌ పేట, కేసుపల్లి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రచార బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️