విశాఖలో ఆపరేషన్‌ గరుడ

Mar 22,2024 08:12 #Drugs, #visakhapatnam
  • భారీ మొత్తంలో పట్టుబడ్డ డ్రగ్స్‌
  • 25 వేల కిలోలు సీజ్‌
  • అధికార పార్టీ హస్తం : చంద్రబాబు
  • దొరికింది టిడిపి వారే : వైసిపి

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో, అమరావతి బ్యూరో : ప్రతిష్టాత్మకమైన విశాఖ పోర్టులో అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌ బట్టబయలైంది. ఆపరేషన్‌ గరుడ పేరుతో సిబిఐ, కస్టమ్స్‌ అధికారులు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో 25 వేల కిలోల డ్రగ్స్‌ దొరికినట్టు గురువారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటన కలకలం రేపింది. దీనిని కొకైన్‌గా నిర్దారించినట్లు సమాచారం. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈవ్యవహారం వెనుక రాష్ట్రంలోని అధికారపార్టీ హస్తం ఉందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించగా, దొరికింది తెలుగుదేశం పార్టీ వారేనని వైసిపి పేర్కొంది. సిబిఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బ్రెజిల్‌లోని శాంతోస్‌ పోర్టు నుంచి విశాఖ పోర్టుకు భారీగా డ్రగ్స్‌ రవాణా జరిగింది. అక్కడి నుండి వచ్చిన ఒక కంటైనర్‌లో 25 కిలోల చొప్పున 1,000 బ్యాగుల్లో మొత్తంగా 25 వేల కిలోల డ్రగ్స్‌ విశాఖ ఓడరేవుకు వచ్చినట్లు సిబిఐ తన నివేదికను గురువారం సాయంత్రం విడుదల చేసింది. విశాఖకు చెందిన ఒక ప్రైవేటు కంపెనీ ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌ పేరుతో వీటిని దిగుమతి చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇలా రవాణా జరిగిన మెటీరియల్‌లో డ్రగ్స్‌ ఉన్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన కస్టమ్స్‌ అధికారులు డ్రగ్స్‌ను గుర్తించి, మొత్తం సరుకును స్వాధీనం చేసుకున్నారు. సరుకును దిగుమతి చేసుకున్న కంపెనీ మీద, కొంతమంది ఏజెంట్లపైనా ఎఫ్‌ఐఆర్‌ను సిబిఐ నమోదు చేసింది. కస్టమ్స్‌ డిపార్టుమెంట్‌ సహాయంతో వైజాగ్‌ పోర్టులోనే ప్రైవేట్‌ షిప్పింగ్‌ కంపెనీ కంటైనర్‌ను సిబిఐ అదుపులోకి తీసుకుని డ్రగ్స్‌ను సీజ్‌ చేసింది. ఇంత భారీ పరిమాణంలో డ్రగ్స్‌ లభ్యం కావడం ఇదే తొలిసారి కావడంతో పోర్టు వర్గాల్లోనూ సంచలనం రేకెత్తిస్తోంది.

సిబిఐ నివేదికలో ఏముంది ?
చంద్రబాబు చేసిన ట్వీట్‌లో సిబిఐ నివేదికలోని కొంత భాగాన్ని జతచేశారు. దానిలో పేర్కొన్న అంశాల ప్రకారం స్థానిక సంధ్య అక్వా ఎక్స్‌పోర్ట్సు ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ప్రతినిధి ఆర్‌విఎల్‌ఎన్‌ గిరిధర్‌తో పాటు మరికొందరు, స్వతంత్ర సాక్షుల సమక్షంలో తనిఖీలు జరిపారు. పట్టుబడ్డ అన్ని బ్యాగుల్లోనూ కొకైన్‌ లేదా మెథాకోల్వన్‌ ఉన్నట్లు తేలింది. ఈ మేరకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు పేరొన్నారు. దీనిపై సంస్థ ప్రతినిధి గిరిధర్‌ను ప్రశ్నించగా మొదటి సారి ఆ సరుకును దిగుమతి చేసుకున్నట్లు తెలిపారని పేర్కొన్నారు.

ఎన్నికల కోసమే : బాబు
ఆంధ్రప్రదేశ్‌ అధికారులు తమకు సహకరించకుండా దూరంగా నిలబడ్డారని ప్రత్యేకం గా పేర్కొన్నారు. దీనినే ప్రస్తావించిన టిడిపి అధినేత చంద్రబాబు అధికారపార్టీ హస్తం ఉందనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల కోసమే ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను రాష్ట్రానికి దిగుమతి చేసుకున్నారని ఆరోపించారు. మరో ప్రకటనలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ డ్రగ్స్‌ దిగుమతి కావడాన్ని సిగ్గుచేటుగా అభివర్ణించారు. గతంలో విజయవాడలో గంజాయి లింకులు బయటపడటాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు.

టిడిపి నేతలకు సంబంధాలు : వైసిపి
డ్రగ్స్‌ స్కామ్‌లో టిడిపి నేతలకు నేరుగా లింకులున్నాయని వైసిపి ఆరోపించింది. ఫేస్‌బుక్‌, ఎక్స్‌లలో చేసిన పోస్టులలో ఈ కేసులో నిందితుడిగా ఉన్న కోటయ్య చౌదరికి టిడిపి నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణదేవరాయలు, రాయపాటి జీవన్‌లతో దగ్గరి సంబంధాలున్నాయని పేర్కొంది. దామచర్ల సత్య చంద్రబాబుకు ఆప్తుడని తెలిపింది. ఆ మేరకు ఫోటోలను విడుదల చేసింది. ఈ కేసులో లోకేష్‌కు, చంద్రబాబుకు నేరుగా సంబంధం ఉండే అవకాశం ఉందని, అందువల్లే ఉలిక్కిపడి ముందుగానే ట్వీట్లు చేస్తున్నారని పేర్కొంది.

➡️