విమ్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ, బర్న్‌ విభాగాలు ప్రారంభం

Mar 7,2024 09:49 #VIMS Hospital, #Visakha

ప్రజాశక్తి-ఆరిలోవ (విశాఖపట్నం) : విశాఖ జిల్లా ఆరిలోవ హెల్త్‌సిటీ పరిధిలో ఉన్న విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో అత్యాధునిక పరికరాలతో కూడిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం, బర్న్‌ వార్డును విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమ్స్‌లో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. గడిచిన రెండేళ్లుగా విమ్స్‌ ఆస్పత్రి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే అవసరమైన వైద్యులు, పారామెడికల్‌, ఇతర సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించినట్లు చెప్పారు. తద్వారా అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు విమ్స్‌ హాస్పటల్‌లో అందుబాటులోకి వచ్చాయన్నారు. గడిచిన రెండేళ్లగా ఒపి, ఐపి మూడింతలు పెరిగినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలువిమ్స్‌ ఆస్పత్రిలో అన్ని రకాల సర్జరీలు, ఇతర వైద్య సేవలను ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయనున్నట్లు కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు. కార్పొరేట్‌ ఆసుపత్రికి దీటుగా అభివృద్ధి చేసిన విమ్స్‌ ఆస్పత్రి ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక వరమన్నారు.

➡️