ధాన్యం కొనుగోళ్లకు ఆన్‌లైన్‌ చిక్కులు

Jan 11,2024 07:55 #rice, #rice crop, #srikakulam
  • చిన్న మిల్లులకు వెల్లువెత్తుతున్న ధాన్యం
  • అన్‌లోడింగ్‌కు రెండు, మూడు రోజుల నిరీక్షణ

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సున్నాడకి చెందిన కుమ్మరి సింహాద్రి అనే రైతు రెండు ఎకరాల్లో వరి సాగు చేశారు. 60 బస్తాల (80 కేజీలు) దిగుబడి వచ్చింది. ధాన్యం అమ్ముకునేందుకు స్థానికంగా ఉన్న లొద్దభద్ర ఆర్‌బికెకు తీసుకువెళ్లి వివరాలు నమోదు చేయించుకున్నారు. ధాన్యాన్ని పలాసలోని ఓ మిల్లుకు కేటాయించారు. మిల్లు దగ్గర అన్‌లోడింగ్‌ చేయించడానికి నానా అవస్థలు పడ్డాడు. మూడు రోజుల పాటు మిల్లుకు సమీపంలోని పడుగాపులు కాస్తున్నారు. బూర్జ మండలం కిలంత్రికి చెందిన ఆర్‌.పట్టాభినాయుడు మూడు ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశారు. 120 బస్తాలు వచ్చాయి. అమ్ముకునేందుకు అల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి వెళ్లగా వివరాలను నమోదు చేసిన సిబ్బంది గార మండలంలోని ఓ మిల్లుకు తరలించాలని చెప్పారు. కిలంత్రి నుంచి సుమారు 55 కిమీ దూరంలోని మిల్లుకు తీసుకు వెళ్లేందుకు అద్దెకు వాహనాన్ని తీసుకుని తరలించారు. సరుకు చూసిన మిల్లరు 10 కేజీలు అదనంగా అడిగారు. ఎనిమిది కేజీలు ఇస్తానని బేరం కుదుర్చుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఉదయం 11 గంటలకు తీసుకు వెళ్లిన ఆ రైతు రాత్రి 10 గంటలకు తిరుగు ముఖం పట్టారు.

ఎదురవుతున్న ఇబ్బందులు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటి వరకు 3,99,857 మంది రైతుల నుంచి 24.27 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.5302.09 కోట్లుగా ఉంది. గత రెండేళ్లుగా ఆన్‌లైన్‌లోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నా ఈ సంవత్సరం ఆ ప్రక్రియ కొంత క్లిష్టతరంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ పలుకుబడి, పైరవీలు చేసే మిల్లర్లే అధిక పరిమాణంలో ధాన్యం తీసుకుంటున్నారని గుర్తించిన ప్రభుత్వం ఈసారి అందరికీ ధాన్యం కేటాయించాలని నిర్ణయించింది. చిన్న మిల్లర్లకు నష్టం మాట పక్కన పెడితే ఇప్పుడు రైతులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. చిన్న మిల్లుల కెపాసిటీ తక్కువ ఉండటంతో పాటు తగినంత స్థలం లేకపోవడంతో అన్‌లోడింగ్‌కు రెండు, మూడు రోజుల పాటు మిల్లుల వద్దే ధాన్యం బస్తాలను తీసుకువెళ్లిన ట్రాక్టర్లు ఉండిపోతున్నాయి. రొటేషన్‌ పద్ధతిలో మిల్లులకు ధాన్యం కేటాయించాల్సి ఉన్నా… చిన్న మిల్లులకు ధాన్యం వెల్లువలా వచ్చి పడుతున్నాయి. తమకు లోడ్‌లు ఆపాలని చిన్న మిల్లర్లు సైతం జిల్లా అధికారులు మొత్తుకుంటున్నా… సమస్య పరిష్కారం కావడం లేదు. రాష్ట్ర స్థాయిలోనే ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందని అటు అధికారులు, మిల్లర్లు చెబుతున్నారు.

అన్‌లోడింగ్‌కు రైతుల నిరీక్షణ

ధాన్యం తరలింపులో రైతులకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. గతేడాది ఒక మండలంలోని రైతులకు వేర్వేరు మండలాల్లోని మిల్లులకు ధాన్యం కేటాయించారు. వీటిని తరలించడానికి రైతులు నానావస్థలు పడ్డారు. ఈ సంవత్సరం అటువంటి సమస్య ఉత్పన్నం కాదని అధికారులు చెప్పినా అదే పునరావృతం అవుతోంది. అమ్మిన ధాన్యాన్ని 40 నుంచి 50 కిమీ దూరంలో ఉన్న మిల్లులకు తరలించడంలో అన్నదాతలు నానాపాట్లు పడుతున్నారు. ఆన్‌లైన్‌ ఇబ్బందులు, అన్‌లోడింగ్‌ సమస్యలతో దళారుల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ధాన్యం అమ్మకంలో రూ.200 నుంచి రూ.300 నష్టపోయినా ఇన్ని ఇబ్బందులు ఎవరు పడతారంటూ కమీషన్‌ ఏజెంట్లకే ఇచ్చేస్తున్నారు. దానికి అదనంగా రెండు, మూడు కేజీలు ధాన్యమిస్తున్నారు. ఆమదాలవలస మండలం ఇసకలపేట గ్రామానికి చెందిన తమ్మినేని నర్సింగరావు 33 ధాన్యం బస్తాలను (80 కేజీలు) బస్తా రూ.1400లకు ఇచ్చేశాడు. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం బస్తాకు రూ.1746.40 రావాల్సి ఉంది. ధాన్యానికి ఎక్కువ ధర కోసం ఓపికతో ఉన్న రైతులు కొనుగోలు కేంద్రం వద్ద నిరీక్షిస్తున్నారు. రబీ సీజన్‌ పనులు, ధాన్యం కొనుగోలు ఇబ్బందులతో పాటు రబీ సీజన్‌ పనులు ఉన్న వారు మాత్రం కమిషన్‌ ఏజెంట్లకే తమ ధాన్యాన్ని ఇచ్చేస్తున్నారు.

➡️