Lokesh: మరోసారి లోకేష్‌ కాన్వాయ్ తనిఖీ

– ఎన్నికల కోడ్‌ పేరుతో ఒకే రోజు రెండుసార్లు పరిశీలన
ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా):గుంటూరు జిల్లా మంగళగిరి టిడిపి అభ్యర్థి నారా లోకేష్‌ కాన్వారును పోలీసులు ఆదివారం తాడేపల్లిలో రెండుసార్లు తనిఖీలు చేశారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా తనిఖీలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాన్వారులోని కార్లన్నింటినీ పరిశీలించారు. ఈ సందర్భంగా తాడేపల్లి ఎస్‌ఐ శ్రీనివాసరావుకు, లోకేష్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రోజుకు రెండుసార్లు తనిఖీ చేస్తారా? అని పోలీసులను లోకేష్‌ ప్రశ్నించారు. వైసిపి నేతల కార్లను ఎందుకు సోదాలు చేయడంలేదని నిలదీశారు. అధికార పార్టీకి ఒక విధంగా, ప్రతిపక్ష పార్టీకి మరో విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. టిడిపి నేతల వాహనాలు మాత్రమే ఆపాలని రూల్‌ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. కాన్వారులో ఉన్న వాహనాలను పరిశీలించిన అనంతరం కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించుకుని పోలీసులు వదిలివేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి వచ్చే సమయంలో తనిఖీలు జరగడం గమనార్హం. అయితే, టిడిపి నాయకులను లక్ష్యంగా చేసుకుని వారి వాహనాలను పోలీసులు పదేపదే తనిఖీలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

➡️