సాగు పెరిగే… ధర తగ్గే..!

Jan 9,2024 10:39 #oil palm farmers
  • ఆయిల్‌పామ్‌ రైతుల గగ్గోలు
  • ఈ ఏడాది 20 వేల ఎకరాల్లో పెరిగిన సాగు
  • క్వింటాల్‌కు రూ.23 వేల నుంచి రూ.12,400కు ధర పతనం
  • కనీసం రూ.18 వేలు ధర ఉండాలని డిమాండ్‌

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఆయిల్‌పామ్‌ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటకు ధర బాగుందని, రైతులు కొత్తగా తోటలు వేస్తుండగా, ఈ ఏడాది ధరమాత్రం భారీగా పడిపోయింది. దీంతో ఆయిల్‌పామ్‌ రైతులకు ఏం చేయాలో తెలీని పరిస్థితి నెలకొంది. ఎన్నో ఆశలతో ఆయిల్‌పామ్‌ తోటలు వేస్తున్న రైతులు లోలోన తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏలూరు జిల్లాలో దాదాపు లక్షా పదివేల ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్‌ సాగుచేస్తున్నారు. పామాయిల్‌ సాగులో రాష్ట్రంలో ఏలూరు జిల్లా ప్రథమస్థానంలో ఉంది. రెండేళ్ల క్రితం ఆయిల్‌పామ్‌ పంటకు సరైన ధర లేకపోవడంతో రైతులు తోటలను తొలగిస్తూ మొక్కజొన్న సాగువైపు మళ్లారు. కామవరపుకోట, ద్వారకాతిరుమల వంటి అనేక మండలాల్లో రైతులు తోటలు తొలగించారు. గతేడాది ఆకస్మికంగా టన్ను పామాయిల్‌ ధర రూ.23 వేలు పలికింది. దీంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. పామాయిల్‌ సాగుపై రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. పంటకు మంచి ధర పలకడంతో అంతకు ముందు ఎకరాకు రూ.50 వేలు, రూ.60వేలు ఉండే కౌలుకాస్తా రూ.లక్ష దాటేసింది. అంతేకాకుండా కొత్తగా తోటలు వేయడం సైతం రైతులు ప్రారంభించారు. దీంతో 2023లో కొత్తగా 20,215 ఎకరాల్లో పామాయిల్‌ సాగు పెరిగింది. పామాయిల్‌ రైతులు ఎన్నో ఆశలతో ముందుకు వెళుతుండగా ఈ ఏడాది అనూహ్యంగా పామాయిల్‌ ధర భారీగా పడిపోయింది. టన్ను ధర రూ.12,300 వరకూ మాత్రమే పలికింది. ఒక్కసారిగా టన్నుకు రూ.పదివేలకుపైగా ధర పడిపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పామాయిల్‌ ధర పతనంతో ఈ ఏడాది రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ముఖ్యంగా కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

పెట్టుబడులు కూడా రాని పరిస్థితి

ఆయిల్‌పామ్‌ సాగులో ఎకరాకు ఎరువులు, కోత ఖర్చులు అన్నీ కలిపి రూ.80వేల వరకూ పెట్టుబడి అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఎకరాకు పది టన్నులకుపైగా దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది తెల్లదోమసోకి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఎకరాకు ఏడేనిమిది టన్నుల దిగుబడి రావడమే గగనంగా మారింది. ఎకరం పామాయిల్‌ తోటకు పెట్టుబడి, కౌలు కలిపితే రూ.1.60 లక్షలు వరకూ అవుతోంది. టన్నుకు రూ.12,300 ధర చొప్పున లెక్కిస్తే ఏడు టన్నులకు రూ.86 వేలు మాత్రమే ఆదాయం వస్తోంది. దీంతో కౌలురైతులు ఎకరాకు రూ.70 వేల వరకూ నష్టపోయారు. పామాయిల్‌ సాగుచేసే రైతులు తక్కువగా లెక్కించినా ఐదెకరాల వరకూ సాగుచేస్తారు. దీంతో ఒక్కో రైతు తక్కువగా లెక్కించినా రూ.3.50 లక్షల వరకూ నష్టపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో కౌలురైతులు అప్పులుపాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పామాయిల్‌ రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రనిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. టన్నుకు కనీసం రూ.18 వేలు ధర ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పామాయిల్‌ రైతులు కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా కొత్త పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీని సైతం నెరవేర్చలేదు. పామాయిల్‌ సాగు పెంపుచేసినట్లు ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. అదేసమయంలో ధర పతనంపై కూడా మాట్లాడితే బాగుంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️