కార్పొరేట్లకు నైవేద్యం

Dec 27,2023 07:20 #Editorial

               ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించడం దారుణం. పాలకులు పన్ను రాయితీలు, రుణాల మాఫీలతోపాటు కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లు, వాటిలో లోడ్‌ చేసిన కంటెంట్‌ కొనుగోలులో 1,250 కోట్ల రూపాయల కుంభకోణం చోటు చేసుకుందని తీవ్ర విమర్శలొచ్చాయి. జనం వద్దంటున్నా విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించి తీరుతామన్న ప్రభుత్వ పట్టుదల వెనుక కూడా అదానీ గ్రూప్‌, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ వంటి కార్పొరేట్‌ ప్రయోజనాలే దాగున్నాయన్నది బహిరంగ రహస్యమే! శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల సముద్ర తీరంలోని అత్యంత విలువైన బీచ్‌శాండ్‌ మైనింగ్‌ను అదానీ సంస్థలకు కట్టబెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయి. ఆ మైనింగ్‌కు ప్రైవేటు రంగాన్ని అనుమతించాలంటూ ఈ ఏడాది మే 25న ముసాయిదా విడుదల చేయడం, చకచకా చట్టసవరణకు బిల్లు ప్రతిపాదించడం వెనుక కార్పొరేట్ల సేవ తప్ప వేరే ప్రయోజనమేదీ కనిపించదు. ప్రతిపక్ష సభ్యులంతా మణిపూర్‌ దారుణాలపై చర్చ జరగాలని పట్టుబడుతున్న సమయంలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడం కేంద్ర ప్రభుత్వ ‘కార్పొరేట్‌ సేవా తత్పరత’కు నిదర్శనం. ఇటీవల గౌతమ్‌ అదాని ముఖ్యమంత్రితో జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్రంలోని బీచ్‌ శాండ్‌ మైన్స్‌లో ‘ప్రాజెక్టు డెవలపర్‌ కమ్‌ ఆపరేటర్‌’ పేరిట 92 శాతం వాటాను ఆఫర్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టెండర్లు పిలిచిందన్న ఆరోపణలు సత్యదూరం కాదు. ఇప్పటికే రాష్ట్రంలోని కృష్ణపట్నం, గంగవరం పోర్టులు అదానీ పరమైనాయి. విశాఖ నగరంలో విలువైన స్థలాలను ఐటి అభివృద్ధి పేరిట అప్పగించారు. పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ అంటూ రాయలసీమ జిల్లాల్లోను, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను తుంగలో తొక్కి వేల ఎకరాలు కట్టబెడుతున్నారు. తాజాగా శారదా నదిపై దేవరాపల్లి మండలంలో మరో పంప్డ్‌ స్టోరేజి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి అదానీ గ్రూప్‌ యత్నాలు సాగిస్తోంది. బీచ్‌ శాండ్‌ మైనింగ్‌తో బంగాళాఖాతం తీరం నుండి తూర్పు కనుమల వరకు రాష్ట్రంలో అన్నిటా అదానీ సామ్రాజ్యం మరింతగా విస్తరిస్తుంది. అదానీ సేవలో తరించిపోతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్‌ అనుకూల విధానాలను జనం ప్రతిఘటించాలి.

‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అంటూ పోరాడి 32 మంది యువకిశోరాల ప్రాణత్యాగంతో సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను జిందాల్‌కు కట్టబెట్టడానికి దొడ్డిదారిన ఫర్నేస్‌ నిర్వహణ పేరిట కేంద్రం ఒప్పందం కుదుర్చుకోవడం అత్యంత మోసపూరితం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు గత వెయ్యి రోజులకుపైగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. ట్రేడ్‌యూనియన్లు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. కొత్తగా పెట్టుబడులు తెస్తాం… పరిశ్రమలు వస్తున్నాయని హౌరెత్తించే నేతలు ఉన్న భారీ పరిశ్రమను ప్రభుత్వరంగంలో కొనసాగించేందుకు కృషి చెయ్యకపోతే ఎలా? ప్రయివేట్‌ స్టీల్‌ ప్లాంట్లకు సొంత ఉక్కు గనులు కేటాయించిన కేంద్రం… ప్రభుత్వ రంగంలోని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయించడంలేదు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విదితమవుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజల సంపద. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేట్‌పరం కానివ్వరాదు. ఢిల్లీ రైతు ఉద్యమ స్ఫూర్తితో స్టీల్‌ ప్లాంట్‌ వద్ద సుదీర్ఘ కాలంగా కార్మికులు దీక్ష సాగించడం అభినందనీయం. విశాల శక్తుల సంఘీభావంతో అది మరింత ముందుకు సాగించాలి. ఉక్కు సాధనకు ఉద్యమం సాగించిన రీతిలోనే దాని పరిరక్షణకు మహౌద్యమం సాగించడమే మన ముందున్న ఏకైక మార్గం. అలా మాత్రమే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం సాధ్యమవుతుంది. ప్రజల సంపదను ప్రజలే కాపాడుకోవాలి. అందుకు సమైక్య, సంఘటిత ఉద్యమాలు, పోరాటాలు సాగించి కార్పొరేట్‌ రాబందుల నుండి దేశాన్ని ప్రజల సంపదను కాపాడుకోవాలి.

➡️