ఒఎన్‌జిసి ‘ఫస్ట్‌ ఆయిల్‌’ ప్రారంభం

Jan 9,2024 08:31 #Kakinada, #ongc

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : బంగాళాఖాతం తీరంలో లోతైన నీటిలో ఉన్న కెజి-డిడబ్ల్యుఎన్‌-98/2 బ్లాక్‌ నుంచి ‘ఫస్ట్‌ ఆయిల్‌’ ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించామని కాకినాడ ఒఎన్‌జిసి ఈస్టర్న్‌ ఆఫ్‌షోర్‌ అసెట్‌ అసెట్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రత్నేష్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కెజి-డిడబ్ల్యుఎన్‌-98/2లో ఉత్పత్తి అవుతున్న ఆయిల్‌తో ఒఎన్‌జిసి మొత్తం ఆయిల్‌ ఉత్పత్తి 11 శాతం నుంచి 15 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వివిధ సాంకేతిక, కోవిడ్‌ సంబంధిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రాజెక్ట్‌ మొదటి దశను మార్చి 2020లో విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ బ్లాక్‌లోని ‘యు’ ఫీల్డ్‌ నుంచి పది నెలల రికార్డు సమయంలో గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. ఈ ఏడాది జనవరి ఏడున ఈ ఫస్ట్‌ ఆయిల్‌ ప్రారంభించడంతో ఫేజ్‌-2 ముగింపు దశకు చేరుకుందని తెలిపారు. మరోవైపు ‘ఎం’ ఫీల్డ్‌ నుంచి ఆయిల్‌ ఉత్పత్తి ప్రారంభమైందని, ఈ ఫీల్డ్‌ అభివృద్ధిలో ముడి చమురు మైనపు స్వభావం వల్ల ఒఎన్‌జిసి అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు. వాటిని అధిగమించడానికి ఒఎన్‌జిసి దేశంలోనే మొదటిసారిగా పైప్‌ టెక్నాలజీలో వినూత్నమైన పైప్‌ను ఉపయోగించిందని తెలిపారు. ఈ డెవలప్‌మెంట్‌లో ఉపయోగించిన సబ్‌-సి హార్డ్‌వేర్‌లను అంతర్జాతీయంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని చెప్పారు. కానీ, మెజారిటీ ఫ్యాబ్రికేషన్‌ పనులు కట్టుపల్లిలోని మాడ్యులర్‌ ఫ్యాబ్రికేషన్‌ ఫెసిలిటీ సెంటర్‌లో జరిగాయని తెలిపారు. ఇది మేక్‌ ఇన్‌ ఇండియాను ప్రోత్సహించడానికి ఒఎన్‌జిసి నిబద్ధతను తెలియజేస్తోందని చెప్పారు. మనదేశ స్వావలంబన శక్తికి దోహదం చేస్తుందని వివరించారు. ఈ ఫీల్డ్‌లో గరిష్టంగా రోజుకు 45 వేల బారెల్స్‌ ఆయిల్‌, పది ఎంఎంఎస్‌సిఎండిలకంటే ఎక్కువగా గ్యాస్‌ ఉత్పత్తి ఉంటుందని చెప్పారు.

➡️