సమ్మె విచ్ఛిన్నానికి నోటీసులు

Jan 12,2024 10:02 #breaking, #notices, #strike
  • అంగన్‌వాడీలు ఇళ్ల వద్ద లేకుంటే కుటుంబసభ్యులకు అందజేత
  • సమస్యలు పరిష్కరించకపోతే రాజకీయ పోరు : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి – యంత్రాంగం : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్న అంగన్‌వాడీలకు అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తూ సమ్మెను విచ్ఛినం చేసేందుకు యత్నిస్తున్నారు. నోటీసులకు తలొగ్గొది లేదని, సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ సమ్మెను కొనసాగిస్తామని అంగన్‌వాడీలు తేల్చి చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం అంగన్‌వాడీల కుటుంబసభ్యులకు, వారు లేకపోతే ఇంటి ఆవరణలోని తలుపులకు నోటీసులు తగిలించి వెళుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారు చేపట్టిన సమ్మె గురువారంతో 31వ రోజుకు చేరుకుంది. చెవ్వులో పూలుపెట్టుకుని, ఒంటికాలిపై నిలబడి, కుర్చీలు నెత్తిన పెట్టుకొని నిరసన తెలిపారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో సమ్మె శిబిరం నుంచి ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ.. అంగన్‌వాడీలను బెదిరించే అధికారులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్మాను అమలు చేసిన అన్ని ప్రభుత్వాలను ఉద్యోగులు ఇంటికి పంపించారని గుర్తు చేశారు. కోటి సంతకాలు సేకరణలో తాము పాలుపంచుకుంటామని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్‌ వద్ద సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, సిపిఐ ప్రజాపోరు, బహుజన సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్‌, వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

ఏలూరు కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సందర్శించి, మాట్లాడారు. అంగన్‌వాడీల నిరవధిక సమ్మె రాజకీయ పోరాటంగా మారకముందే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పండగ అనంతరం ఈ ఉద్యమం రాజకీయ రూపం తీసుకుంటుందని హెచ్చరించారు. అంగన్‌వాడీల్లో నూటికి 90 శాతం దళిత, బలహీన వర్గాల మహిళలేనని, ఆ మహిళలను తక్కువ అంచనా వేస్తే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు రాసిన లేఖపై ఆయన సంతకం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం తదితరులు పాల్గొన్నారు.

విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సందర్శించి మద్దతు తెలిపారు. నెల రోజులుగా సమ్మె చేస్తుంటే వారి డిమాండ్లను నెరవేర్చాల్సిందిపోయి నిర్బంధం ప్రయోగించడం దారుణమన్నారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడలో చెవిలో పువ్వులు పెట్టుకొని, సబ్బవరం, మునగపాక, నక్కపల్లి కేంద్రాల్లో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. అల్లూరి జిల్లాలోని విఆర్‌.పురం, రంపచోడవరం కేంద్రాల్లో నిరాహార దీక్షలు కొనసాగాయి.

బాపట్ల జిల్లా మార్టూరులో, ప్రకాశం జిల్లా మార్కాపురంలో పలువురు అంగన్‌వాడీల ఇళ్లకు షోకాజ్‌ నోటీసులు తగిలించారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో షోకాజ్‌ నోటీసులను దగ్ధం చేశారు.తిరుపతి పాత మున్సిపల్‌ కార్యాలయం దీక్షా శిబిరం వద్ద 31 అంకె రూపంలో కూర్చొని నిరసన తెలిపారు.

నాయుడుపేటలో ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట భిక్షాటన చేశారు. శ్రీకాకుళంలో జ్యోతిరావు పూలే పార్కు వద్ద 24గంటల నిరాహార దీక్షను కొనసాగించారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో కుర్చీలు నెత్తిన పెట్టుకొని నిరసన తెలిపారు. బొబ్బిలిలో సమ్మె శిబిరం వద్దకు ప్రభుత్వం పంపిన నోటీసులు పట్టుకొని పోస్టుమ్యాన్లు రావడంతో అంగన్‌వాడీలంతా నిరాకరించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో చెంపలు వేసుకొని జగన్‌ను అవనసంగా గెలిపించామంటూ నిరసన తెలిపారు. కర్నూలు ధర్నా చౌక్‌ వద్ద, నంద్యాల, నెల్లూరులో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.కాకినాడలో ఆశావర్కర్లు, అమలాపురంలో సిఐటియు నాయకులు హాజరై మద్దతు తెలిపారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో అంగన్‌వాడీ కేంద్రాలకు అధికారులు నోటీసులు అంటించారు.

➡️