ప్రజాస్వామ్యంలో దేన్నీ దాచివుంచలేం!

election commission rajiv kumar

దాతల గోప్యతకై వ్యవస్థాగత యంత్రాంగం రూపొందించాలి
సిఇసి రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యంలో దేన్నీ దాచిపెట్టడానికి ఎలాంటి అవకాశం వుండదని చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల విక్రయాలు, కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించిన వివరాలన్నీ బహిర్గతమవుతున్న నేపథ్యంలో ఆయన శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలకు సంబంధించి దాత గోప్యతతో పారదర్శకతను సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. దాతల గోప్యతకు ఒక వ్యవస్థాగత యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరాన్ని కూడా పరిశీలించాల్సి వుందని సిఇసి నొక్కి చెప్పారు. ”మొదటినుండి పారదర్శకత వుండాలనే కమిషన్‌ చెబుతూ వస్తోంది. సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించి మా వైఖరి కూడా తెలియచేశాం. అన్ని విషయాలు అందరికీ తెలియడమే ప్రజాస్వామ్యం” అని అన్నారు. దాతల గోప్యతను పాటించేందుకు ఒక వ్యవస్థాగత యంత్రాంగాన్ని ఇప్పుడు దేశం రూపొందించాల్సి వుందన్నారు. రాజకీయ పార్టీలు తమ వార్షిక ఖర్చులు, విరాళాల వివరాలను అందజేయాలని, వాటిని ఇసి వెబ్‌సైట్‌లో ప్రచురిస్తామని తెలిపారు. లెక్కకు రాని రూపాల్లో వచ్చే విరాళాలను కూడా ఎలా నియంత్రించాలనేది దేశం మొత్తం కలిసి పనిచేయాల్సిన విషయమన్నారు. దాతల గోప్యతను కాపాడడం, వారు వేధింపులకు గురి కాకుండా చూడడం, ఆ నిధులు ఏ ఏ మార్గాల ద్వారా రావాలి వంటి అంశాలన్నింటినీ కలిసికట్టుగా పనిచేసి నిర్ణయించాల్సి వుందన్నారు. ఈ డిజిటల్‌ యుగంలో నగదు రూపాన్ని తగ్గించాల్సి వుందన్నారు. ఇంతకంటే మెరుగైన వ్యవస్థ కచ్చితంగా వస్తుందని అన్నారు.

543 కాదు, 544 సీట్లకు పోలింగ్‌? : ‘అదనపు సీటు’ను వివరించిన సిఇసి
పార్లమెంట్‌ నియోజకవర్గాలు 543 వుండగా 544 స్థానాలకు ఎన్నికలు ప్రకటించారంటూ ఒక రిపోర్టర్‌ ప్రశ్నించడం పట్ల చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) రాజీవ్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తూ ఆయన చేసిన ప్రసంగంలో అనేక వివరాలు వుండగా, ఒక రిపోర్టర్‌ మాత్రం ఆసక్తికకరమైన అంశాన్ని లేవదీశాడు. వెంటనే రాజీవ్‌ కుమార్‌ ఆ వ్యక్తిని అభినందించారు. 544 సీట్లకు ఎన్నికలు ప్రకటించడానికి గల కారణాన్ని వివరించారు. అదనపు సీటుకు ఎన్నికంటూ ఏమీ లేదని చెప్పారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఔటర్‌ మణిపూర్‌ నియోజకవర్గంలో ఓటింగ్‌ను రెండుసార్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ”మణిపూర్‌లో నెలకొన్న వాస్తవిక పరిస్థితులను కమిషన్‌ సమీక్షించింది. వేర్వేరు నియోజకవర్గాల్లో నమోదైన పెద్ద సంఖ్యలో ఓటర్లు ఇటీవలి ఘర్షణల కారణంగా వేర్వేరు ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. వివిధ జిల్లాల్లోని సహాయ శిబిరాల్లో వారు ప్రస్తుతం నివసిస్తున్నారు. వివిధ పక్షాలతో కమిషన్‌ చర్చలు జరిపిన మీదట సహాయ శిబిరాల వద్ద ప్రత్యేక పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.” అని ఎన్నికల కమిషన్‌ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. మణిపూర్‌లో అంతర్గతంగా నిర్వాసితులైన వారు సహాయ శిబిరాల్లో ఓటు వేయడానికి గానూ ఫిబ్రవరి 29న ఒక ప్రత్యేక పథకాన్ని జారీ చేశామని ఆ ప్రకటనలో తెలిపింది.

➡️