వాజ్‌లో మెంతితో నాన్‌వెజ్‌!

Feb 25,2024 13:11 #ruchi, #Sneha

మెంతికూర మన ఇంట్లోనే కుండీల్లో పెంచుకోవచ్చు. అప్పుడు మరింత రుచి తోడవుతుంది. ఆరోగ్యాన్ని పెంచే మెంతి వేపుడైనా, గ్రేవీ అయినా, పప్పులో అయినా.. ఇలా వెజ్‌గానే చేసుకోవడం తెలుసు. అయితే మెంతికూర వెజ్‌ / నాన్‌వెజ్‌ ఎందులోకైనా మరింత రుచి అందిస్తుంది. అందుకే మేలు చేసే మెంతి.. రుచుల్లో మేటిగా ఉంది. అయితే ఎప్పుడూ చేసుకునేవి కాకుండా వెరైటీగా మెంతికూరతో నాన్‌వెజ్‌ వంటలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

ఫిష్‌ కర్రీ..

కావల్సినవి : చేపముక్కలు -4, తాజా మెంతికూర-4 కప్పులు, నూనె- తగినంత, ఉల్లిపాయ తరుగు-కప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌-స్పూన్‌, పెద్ద టమాటా-1 (సన్నని ముక్కలు చేసుకోవాలి), కారం – 2 స్పూన్లు, ధనియాల పొడి – స్పూన్‌, మెంతులు, జీలకర్ర పొడి- అర టీస్పూన్‌, పసుపు- చిటికెడు, ఉప్పు – తగినంత, నిమ్మరసం – అర టీస్పూన్‌

తయారీ : చేపముక్కలకు ఉప్పు రాసి, రుద్ది, పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. పాన్‌లో నూనె పోసి, వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి, పచ్చివాసన పోయేలా వేయించాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి, కారం, పసుపు, ధనియాల పొడి, మెంతులు, జీలకర్రపొడి వేసి బాగా ఉడికించాలి. గుజ్జులా అయ్యాక మెంతికూర వేసి కలపాలి. ఇది కూడా బాగా వేగాక చేప ముక్కలు వేయాలి. అందులో ఉప్పు, తగినన్ని నీళ్లు (అవసరమైతేనే) పోసి, సన్నని మంట మీద ఉడికించాలి. దీనిని సర్వ్‌ చేసుకునే ముందు నిమ్మరసం కలుపుకోవాలి. అంతే మెంతికూర ఫిష్‌ కర్రీ అదిరిపోయేలా ఉంటుంది.

ఖైమాతో..

కావల్సినవి : నూనె – తగినంత, ఉల్లిపాయ తరుగు -2 కప్పులు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- స్పూన్‌, ఖైమా – పావుకేజీ, జీలకర్ర పొడి- స్పూన్‌. ఎండుమిర్చి-2, పసుపు-చిటికెడు, ఉప్పు-తగినంత, నల్ల మిరియాలు-8, యాలకులు-2, లవంగాలు-4, టమోటా-1 (సన్నగా కట్‌ చేసుకోవాలి), నీళ్లు-తగినన్ని, మెంతికూర – కప్పు, జాపత్రి-జాజికాయ పొడులు- చిటికెడు, పచ్చిమిర్చి-3, కొత్తిమీర తరుగు-కొద్దిగా.

తయారీ : పాన్‌లో నూనె పోసి, ఉల్లిపాయ తరుగు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకూ వేయించాలి. అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి, పచ్చివాసన పోయేలా వేపాలి. పచ్చిమిర్చి కూడా వేసి, వేగాక ఖైమా వేయాలి. అందులో నీళ్లంతా ఇగిరి, రంగు మారే వరకూ వేయించాలి. పది నిమిషాలు నూనె విడిపోయేలా ఉడికించాలి. ఉడికాక జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. నల్లమిరియాలు, యాలకులు, లవంగాలు వేసి కలపాలి. టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికించాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఇలా సన్న సెగ మీద అరగంట సేపు ఉడికించాలి. తర్వాత మెంతి ఆకులు వేసి బాగా కలపాలి. నూనె విడిపోయే వరకూ మూతపెట్టి, సన్నని మంట మీద ఉడికించాలి. ఇప్పుడు జాపత్రి, జాజికాయ, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. చివరిలో కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మెంతికూర ఖైమా రెడీ!

చికెన్‌తో..

కావల్సినవి : నూనె – తగినంత, ఉల్లిపాయ తరుగు -2 కప్పులు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- స్పూన్‌, చికెన్‌ – అరకేజీ, జీలకర్ర పొడి- స్పూన్‌. కారం-తగినంత, పసుపు-చిటికెడు, ఉప్పు-తగినంత, గరం మసాలా-స్పూన్‌, టమోటా-2 (సన్నగా కట్‌ చేసుకోవాలి), నీళ్లు-తగినన్ని, మెంతికూర – కప్పు, ధనియాల- చిటికెడు, పచ్చిమిర్చి-3, కొత్తిమీర తరుగు-కొద్దిగా.

తయారీ : పాన్‌లో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ తరుగు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి, పచ్చి వాసన పోయేలా వేపాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేయాలి. ఇది కొద్దిగా వేగాక, శుభ్రం చేసుకున్న చికెన్‌ వేయాలి. దీనిలో నీరంతా ఇగిరిపోయి, రంగు మారేవరకూ వేపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి, నూనె విడిపోయే వరకూ చికెన్‌ను బాగా ఉడికించాలి. నూనె విడిపోయాక మెంతికూర వేసి, బాగా కలపాలి. ఇది కూడా వేగి, నూనె విడిపోయాక చివరిలో కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే మెంతికూర చికెన్‌ కర్రీ రెడీ!

➡️