విశాఖ మెట్రో కోసం ఎటువంటి ప్రతిపాదన లేదు : కేంద్ర మంత్రి కౌషల్‌ కిషోర్‌

Dec 11,2023 20:12 #Metro Stations, #visakhapatnam

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విశాఖ మెట్రో కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం రీత్యా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదన లేదని కేంద్ర పట్టణ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి కౌషల్‌ కిషోర్‌ తెలిపారు. టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మెట్రో రైల్‌ పాలసీ-2017లోని నిబంధనలకు అనుగుణంగా సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలు, ఆవశ్యకత, వనరుల లభ్యత ఆధారంగా పట్టణ రైలు ఆధారిత వ్యవస్థకు ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ప్రస్తుతం, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదన ఏదీ లేదని అన్నారు.

  • స్మార్ట్‌ సిటీల నిధుల్లో 83 శాతం ఖర్చు

ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు స్మార్ట్‌ సిటీల నిధుల్లో 83 శాతం ఖర్చు అయిందని కేంద్ర సహాయ మంత్రి కౌషల్‌ కిషోర్‌ తెలిపారు. వైసిపి ఎంపి వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నాలుగు స్మార్ట్‌ సిటీలకు మొత్తం రూ.3,538 కోట్లు విడుదల కాగా, అందులో 2,951.81 (83 శాతం) కోట్లు ఖర్చు అయినట్లు మంత్రి తెలిపారు. రూ.586.19 కోట్లు (17 శాతం) ఖర్చు కాలేదు. ఇందులో అమరావతి స్మార్ట్‌ సిటీకి రూ.1,016 కోట్లు విడుదల చేయగా, రూ.779.29 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రూ.236.71 కోట్లు ఇంకా ఖర్చు చేయలేదు. కాకినాడ స్మార్ట్‌ సిటీకి రూ.978 కోట్లు విడుదల కాగా, రూ.783.57 కోట్లు ఖర్చు చేశారు. రూ.194.43 కోట్లు ఖర్చు చేయలేదు. తిరుపతి స్మార్ట్‌ సిటీకి రూ.578 కోట్లు విడుదల కాగా, రూ.550.48 కోట్లు ఖర్చు చేశారు. రూ.27.52 కోట్లు ఖర్చు చేయలేదు. విశాఖపట్నం స్మార్ట్‌ సిటీకి రూ.966 కోట్లు విడుదల కాగా, రూ.838.47 కోట్లు ఖర్చు చేశారు. రూ.129.53 కోట్లు ఖర్చు చేయలేదు. నాలుగు స్మార్ట్‌ సిటీల్లో 283 ప్రాజెక్టులకు గానూ, 224 ప్రాజెక్టులు పూర్తి కాగా, 59 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.

➡️