ఎల్‌ఐసికి సాటిలేరెవరూ..

Dec 30,2023 21:46 #Business

98.5 బీమా క్లెయింల పరిష్కారం

ప్రయివేటు సంస్థలతో పోల్చితే టాప్‌

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) జీవిత బీమా క్లెయింల పరిష్కారంలో మెరుగైన పనితీరును కనబర్చింది. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డిఎ) గణంకాల ప్రకారం.. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 98.5 క్లెయింలను పరిష్కరించింది. కాగా.. ఇంతక్రితం ఏడాదిలో 98.7 శాతం క్లెయింల పరిష్కారంతో పోల్చితే స్వల్పంగా తగ్గినప్పటికీ.. ప్రయివేటు రంగ బీమా సంస్థలతో పోల్చితే అత్యంత మెరుగైన పనితీరును కనబర్చింది. బీమా పరిశ్రమలో దాదాపు 60 శాతం పైగా వాటాతో మార్కెట్‌ లీడర్‌గా ఉంది. కేవలం ఒక్క అంకె, రెండు అంకెల మార్కెట్‌ వాటా కలిగిన అనేక సంస్థలు క్లెయింల పరిష్కారంలో వెనుకబడి ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రయివేటు జీవిత బీమా సంస్థలు 98 శాతం క్లెయింలను మాత్రమే పరిష్కరించాయి. ఇంతక్రితం ఏడాది ఈ నిష్పత్తి 98.1 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం 2022-23లో గ్రూప్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో అన్ని బీమా కంపెనీలకు కలిపి 12.5 లక్షల క్లెయింలు రాగా.. 12.4 లక్షల క్లెయింలు పరిష్కారం అయ్యాయి. కాగా.. గ్రూప్‌ క్లెయింల్లో ఎల్‌ఐసి దాదాపు 99 శాతం పరిష్కరించింది. ప్రయివేటు సంస్థలు 99.4 శాతం సెటిల్‌ చేశాయి. జీవిత బీమా వ్యాపారంలో సరెండర్లు లేదా ఉపసంహరణల క్లెయింలు 25.6 శాతం పెరిగి రూ.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వీటిలో ఎల్‌ఐసి చెల్లించినవే 56.3 శాతం పాలసీలు ఉన్నాయి. మొత్తం జీవిత బీమా పరిశ్రమ పాలసీదార్లకు చెల్లించిన ప్రయోజనాల విలువ రూ. 5 లక్షల కోట్ల వరకూ ఉంది. ఇది నికర ప్రీమియం ఆదాయంలో 64 శాతం. వ్యక్తిగత జీవిత బీమా వ్యాపారంలో 10.8 లక్షల డెత్‌ క్లెయింలు రాగా, కంపెనీలు 10.6 లక్షల క్లెయింలను పరిష్కరించి రూ. 28,611 కోట్లు చెల్లించాయి.గడిచిన ఆర్థిక సంవత్సరంలో సాధారణ, వైద్య బీమాకు సంబంధించిన 2.36 కోట్ల క్లెయింలు పరిష్కారం అయ్యాయి. వీటి విలువ రూ70,930 కోట్లుగా ఉంది. ఇంతక్రితం ఏడాది రూ.69,498 కోట్ల విలువ చేసే వైద్య బీమా క్లెయింలు సెటిల్‌ చేయబడ్డాయి. ఇదే సమయంలో క్లెయింల సగటు విలువ రూ.30,087గా నమోదయ్యింది. కాగా.. 2022-23లో ఇది రూ.30,087గా ఉంది.

➡️