కలయికపై లేదు క్లారిటీ

Apr 10,2024 22:04

 ఊళ్లోకి వచ్చినా ఇంటికి వెళ్లలేని స్థితిలో గుమ్మడి

 తామేం చేయాలో పార్టీనే చెప్పాలన్న ‘పెంట’

 టిడిపి శ్రేణుల్లో ఇంకా అయోమయం

ప్రజాశక్తి-మక్కువ : మండలంలో నెలకొన్న టిడిపి గ్రూపుల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఈ నెల 8న విశాఖ పట్నంలో జరిగిన చర్చల్లో టిడిపి అగ్ర నేతలు.. ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి, పెంట తిరుపతిరావు మధ్య విభేదాలను సద్దుమణిగింపజేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా బుధవారం పెంట తిరుపతిరావు ఇంటి వద్ద సంధ్యారాణితో కలిసి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్న సూచన కూడా చేసినట్లు తెలిసింది. అయితే అధిష్టానం ఆదేశాల మేరకు పెంట తిరుపతిరావు తన గ్రూపుతో బుధవారం ఎ.వెంకన్నపేటలో ఉన్న తన నివాసం వద్ద సంధ్యారాణి రాక కోసం ఎదురు చూడ సాగారు. ఎ.వెంకంపేట గ్రామంలోని టిడిపి మండల అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్‌ నాయుడు నివాసానికి సంధ్యారాణి వెళ్లారు. అక్కడ పరామర్శ కార్యక్రమం ముగించుకుని ఆ గ్రూపు కలిసితో తిరుపతిరావు వద్దకు వెళ్లాలని విషయం చర్చించినట్లు తెలిసింది. అయితే అందులో ముగ్గురు వ్యక్తులు తిరుపతిరావుతో కలవొద్దంటూ ఆమెకు మోకాలడ్డడంతో అక్కడి నుంచి వెనుతిరిగారు.మేమేం చేయాలో పార్టీ చెప్పాలిటిడిపి అధిష్టానం ఆదేశాల మేరకు బుధవారం ఉమ్మడి సమావేశం కోసం సాయంత్రం ఐదున్నర గంటల వరకు తన నివాసం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి వేచి చూసినా గుమ్మడి సంధ్యారాణి రాలేదని పెంట తిరుపతిరావు విలేకరులకు తెలిపారు. ఘన స్వాగతం పలికేందుకు తామంతా ఎదురుచూసినప్పటికీ అభ్యర్థి స్థానంలో ఉన్న ఆమె తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడం, పాత ధోరణి కొనసాగిస్తుండడంపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దీనిపై తామంతా ఏమి చేయాలని దాన్ని పార్టీ నిర్ణయించాలని తెలిపారు.

➡️