ఆకలి కేకలు.. రోజంతా పస్తే..

Mar 6,2024 10:49 #child, #lowest poverty rate

దేశంలో 67 లక్షల మంది చిన్నారులకు నో ఫుడ్‌

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే

న్యూఢిల్లీ : దేశంలో 67 లక్షల మంది చిన్నారులు రోజంతా పస్తులతో కాలక్షేపం చేస్తున్నారు. 24 గంటల పాటు ఆహారం అనేదే లేకుండా కాలం గడుపుతున్నారు. 2019-2021 కాలానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ చేదు నిజాన్ని బయటపెట్టింది. దేశంలోని చిన్నారుల్లో 19.3 శాతం మంది రోజంతా ఆకలితో అలమటించిపోతున్నారు. గునియా (21.8 శాతం), మాలి (20.5 శాతం) తర్వాత భారతావని మూడో స్థానంలో నిలవడం సిగ్గుచేటే. పశ్చిమాసియా దేశాలైన గునియా, బెనిన్‌, లైబేరియా, మాలిలో నెలకొన్న పరిస్థితులే మన దేశంలోనూ కన్పిస్తున్నాయని సర్వే తేల్చింది. బంగ్లాదేశ్‌లో 5.6 శాతం, పాకిస్తాన్‌లో 9.2 శాతం, డీఆర్‌ కాంగోలో 7.4 శాతం, నైజీరియాలో 8.8 శాతం, ఇథియోపియాలో 14.8 శాతం మంది చిన్నారులు రోజంతా ఆకలితో నకనకలాడుతుంటే మన దేశంలో ఆ సంఖ్య మరింత అధికంగా ఉండడం గమనార్హం. చిన్నారులకు ఆహారం లభించకపోవడంతో పాటు తల్లులు తమ పిల్లలకు అవసరమైన పాలను అందించలేకపోవడం దీనికి కారణమేనని బాలల పౌష్టికాహార అంశాలకు సంబంధించిన ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆరు నెలల వయసు నుండి 24 నెలల వయసు వరకూ ఉన్న పిల్లల్లో 19.3% మందికి రోజులో 24 గంటలూ పాలు లేదా ఘన ఆహారం లేదా సెమీ ఘన ఆహారం లభించడం లేదు. ప్రపంచంలోని 92 నిరుపేద, పరిమిత ఆదాయం కలిగిన దేశాల్లో పరిశోధకులు సర్వే నిర్వహించారు. ఈ దేశాల్లో రోజంతా ఆహారం లభించని చిన్నారుల్లో 99 శాతం మంది తల్లి పాలు తాగుతున్న వారే. వీరికి ఆహారం లభించకపోయినప్పటికీ కొంతమేర కేలరీలు అందుతున్నాయి. అయితే ఆరు నెలల వయసున్న చిన్నారులకు తల్లి పాలు సరిపోవు. వారికి అవసరమైన పౌష్టికాహారం తల్లి పాల ద్వారా మాత్రమే లభించదు. వారికి తల్లి పాలతో పాటు అదనపు ఆహారం ద్వారా ప్రొటీన్లు, శక్తి, విటమిన్లు, ఖనిజాలు అందించాల్సి ఉంటుంది. రోజంతా ఆహారం లభించని చిన్నారులు దక్షిణాసియాలోనే ఎక్కువగా ఉన్నారని సర్వే తెలిపింది. ఆ ప్రాంతంలో 80 లక్షల మంది రోజంతా పస్తులతో గడుపుతుంటే వారిలో ఒక్క భారతదేశంలోనే 67 లక్షల మంది ఆకలి మంటలతో బాధపడుతున్నారు. ‘ఆరు నెలల వయసున్న పిల్లలకు ఆహారాన్ని అందించడం తేలికైన పని కాదు. అందుకు సమయం, శక్తి అవసరం. గ్రామాలు, పట్టణాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు ఆదాయం కోసం రోజంతా పని చేయాల్సి వస్తుంది. వారికి తమ పిల్లలకు కావాల్సిన అదనపు ఆహారాన్ని అందించడం సాధ్యం కావడం లేదు’ అని పిల్లల వైద్యుడు, ప్రజారోగ్య నిపుణుడు వందన ప్రసాద్‌ తెలిపారు.

➡️