బడ్జెట్‌ ప్రసంగాల్లో అతి తక్కువ సమయం ఇదే..

న్యూఢిల్లీ :    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేవలం 57 నిమిషాల్లోనే ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని ముగించేశారు. గంటలోపే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని ముగించడంతో.. ఆమె బడ్జెట్‌ ప్రసంగాల్లో అతి తక్కువ సమయం (అతి చిన్న) ప్రసంగంగా రికార్డు సృష్టించింది.

అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డ్‌ కూడా ఆమె ఖాతాలోనే ఉంది. 2020-21లో బడ్జెట్‌ ప్రవేశపెడుతూ 162 నిమిషాల (2 గంటల 42) పాటు ప్రసంగించారు. బడ్జెట ప్రసంగాల్లో అదే టాప్‌. ఇక 2019-20 బడ్జెట్‌ను దాదాపు 137 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది రెండో అతిపెద్ద ప్రసంగం. అంతకముందు 2003-04 బడ్జెట్‌ను జశ్వంత్‌సింగ్‌ 135 నిమిషాల పాటు  చదివారు. అప్పటి వరకు ఇదే అతిపెద్ద బడ్జెట్‌ ప్రసంగంగా ఉంది. ఇక 2022-23 ప్రసంగాన్ని నిర్మల 86 నిమిషాల్లో ముగించారు.

పార్లమెంట్‌లో ఎక్కువ సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగానూ నిర్మలా సీతారామన్‌ రికార్డ్‌ సృష్టించారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్  వరుసగా ఆరు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.  అలాగే పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పని చేసిన తొలి మహిళగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళగానూ రికార్డు ఆమె పేరుమీదే ఉంది.  2019లో అధికారంలోకి రాగానే బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడామె కేవలం తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

➡️