రెజ్లర్ల పోరుతో దిగొచ్చిన కేంద్రం-నూతన ప్యానెల్‌ రద్దు చేసిన ప్రభుత్వం

న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) నూతన కార్యవర్గాన్ని రద్దు చేయాలని రెజ్లర్లు తాజాగా చేపట్టిన పోరాటానికి కేంద్రం దిగరాక తప్పలేదు. డబ్ల్యూఎఫ్‌ఐ నూతన ప్యానెల్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. కొత్తగా ఎన్నికైన ప్యానల్‌ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుందని క్రీడా మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. డబ్ల్యూఎఫ్‌ఐ నియమాలను, నిబంధనలను నూతన ప్యానెల్‌ పూర్తిగా విస్మరించిందని విమర్శించింది. అలాగే డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలను నియంత్రించడానికి, నిర్వహించడానికి ఒక తాత్కాలిక సంస్థను ఏర్పాటు చేయాలని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఒఎ)ను క్రీడా మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఐఒఎకు లేఖ రాసింది. డబ్ల్యూఎఫ్‌ఐను రద్దు చేయలేదని స్పష్టం చేసింది.కోర్టు కేసులతో సుదీర్ఘంగా వాయిదా పడుతూ వచ్చిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నికలు డిసెంబర్‌ 21న ముగిశాయి. మాజీ అధ్యక్షుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సన్నిహితుడు సంజరు సింగ్‌ ఇటీవల ఎన్నికల్లో కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. సంజయ్ సింగ్‌ 40 ఓట్లు దక్కించుకోగా.. మాజీ రెజ్లర్‌ అనిత షియోరాన్‌కు ఏడు ఓట్లు పోలయ్యాయి. బ్రిజ్‌భూషణ్‌ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి, కరడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాది సంజయ్ సింగ్‌ అధ్యక్ష కుర్చీలో కూర్చోవటంతో.. రెజ్లింగ్‌ క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. అండర్‌-15, అండర్‌-20 జాతీయ ట్రయల్స్‌ గోండాలోని నందినగర్‌లో నిర్వహిస్తున్నట్టు ఇటీవల బ్రిజ్‌భూషణ్‌ ప్రకటించారు. నిబంధనల ప్రకారం ఈ ట్రయల్స్‌ను ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే నిర్వహించాలి. ‘భారత రెజ్లింగ్‌ సమాఖ్య రూల్స్‌ 3(ఈ) ప్రకారం.. ఏదేని సీనియర్‌, జూనియర్‌ లేదా సబ్‌ జూనియర్‌ జాతీయ చాంపియన్‌షిప్స్‌ను యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ రూల్స్‌ను అనుసరించి.. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే నిర్వహించాలి. ఇటువంటి నిర్ణయాలను ముందస్తుగా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం ఎజెండాలో ఉంచి, ఆపై నిర్ణయాలు తీసుకోవాలి. నూతనంగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పూర్తిగా గత పర్యాయం ఆఫీస్‌ బేరర్ల ఆధీనంలో పని చేస్తుందని అనిపిస్తుంది. ఇది జాతీయ స్పోర్ట్స్‌ కోడ్‌కు అవమానం. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు, డబ్ల్యూఎఫ్‌ఐ నూతన కార్యవర్గం రెజ్లింగ్‌కు సంబంధించి ఎటువంటి కార్యకలాపాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు వీల్లేదు’ అని క్రీడాశాఖ పేర్కొంది. సంజరు సింగ్‌ సారథ్యంలోని డబ్ల్యూఎఫ్‌ఐ.. అటు సమాఖ్య సొంత నిబంధనలు, ఇటు జాతీయ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కోడ్‌ను పాటించలేదని క్రీడాశాఖ తన ఉత్వర్వుల్లో తెలిపింది.

రద్దును స్వాగతిస్తున్నాం : సాక్షి మాలిక్‌

డబ్ల్యూఎఫ్‌ఐ నూతన ప్యానల్‌ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రముఖ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ తెలిపారు. ‘ఏదైనా మంచి జరగడానికి ఇది మొదటి అడుగు. మేము ఏ కారణం కోసం పోరాడుతున్నామో దానిని ప్రభుత్వం మరింతగా అర్థం చేసుకుంటుందని నేను నమ్మకంగా ఉన్నాను’ అని మాలిక్‌ అన్నారు. ‘ఫెడరేషన్‌కు మహిళా అధ్యక్షురాలు ఉంటే, అది మహిళా రెజ్లర్ల భద్రతకు మంచిది. ఇది దేశంలోని సోదరీమణులు, కుమార్తెల కోసం జరిగిన పోరాటం’ అని పేర్కొన్నారు.

అలాగే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన బజరంగ్‌ పూనియా తన పద్మశ్రీ అవార్డును మాత్రం మళ్లీ వెనక్కితీసుకోనని ప్రకటించారు. ‘పద్మశ్రీ నేను వాపస్‌ ఇచ్చాను. నేను దానిని మళ్లీ తిరిగి తీసుకోను. మన సోదరీమణులు కుమార్తెల గౌరవం కంటే ఏ అవార్డు గొప్పది కాదు’ అని పూనియా అన్నారు. న్యాయం జరిగిన తర్వాతే పద్మశ్రీని వెనక్కి తీసుకోవడం గురించి ఆలోచిస్తానని తెలిపారు. ఈ నెల 21న సంజయ్ సింగ్‌ ఎన్నికకు వ్యతిరేకంగా సాక్షిమాలిక్‌ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలకగా, పూనియాతో పాటు డెఫ్లింపిక్స్‌ బంగారు పతక విజేత వీరేందర్‌ సింగ్‌ యాదవ్‌ కూడా తమ పద్మశ్రీ అవార్డులను వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించండం, వివిధ రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా కూడా ఈ విషయంలో మద్దతుగా రంగంలోకి దిగుతామని హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూఎఫ్‌ఐ నూతన ప్యానెల్‌ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నూతన అధ్యక్షులు సంజరు సింగ్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. సస్పెన్షన్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తామని, చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే చట్టపరంగా పోరాటం చేస్తామని అన్నారు.

➡️